హైదరాబాదులో ఐటి అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవను తెలంగాణ ఐటి మంత్రి, రాజకీయ వారసుడు కెటిఆర్ ప్రశంసించడం అనేక వ్యాఖ్యలకు దారితీసింది. టిడిపి టిఆర్ఎస్ దగ్గరవుతున్నాయనేందుకు ఇది సంకేతమని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇది అవకాశవాదమని కొందరు విమర్శించారు కూడా. ఏమైనా ఆలస్యంగా కెటిఆర్ ఇచ్చిన కితాబులో నిజం లేదని మాత్రం ఎవరూ అనలేరు. చంద్రబాబు చేశారని గతంలోనూ కెటిఆర్ చెప్పడం నేను విన్నాను.కాకుంటే చారణా కోడికి బారణా మసాలా అని జరిగిన దాని కన్నా ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని అప్పట్లో విమర్శించారు. ఇప్పుడేమో ప్రత్యేకించి మైక్రోసాప్ట్కు సంబంధించి మొదట తీసుకొచ్చింది చంద్రబాబేనని వెల్లడించారు. ఒక వేళ రాజకీయ అవసరాలకోసమే అనుకున్నా ఇందులో ఆక్షేపించవలసిందేమీ లేదు.ఆ అనుభవంతో అమరావతిని కూడా అలాగే ప్రపంచ ఐటి నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పడంలో కొంత లౌక్యం వుంది.టెక్ మహేంధ్ర క్యాంపస్లో ఉత్సవం గనక అక్కడి వాతావరణాన్ని గమనంలో వుంచుకుని మాట్లాడివుంటారు. అలాగే కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువు గనక టిడిపిని అధినేతను కాస్త సంతోషపెట్టే మాటలు మాట్టాడ్డం మంచిదని అనుకుని వుండొచ్చు మూడవది దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులలోనూ విశ్వాసం పెంచవచ్చుననే ఆలోచనా వుండొచ్చు. విశేషమేమంటే కెటిఆర్ చంద్రబాబును పొగుడుతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను విమర్శించడం. ఉమా మాధవరెడ్డిని చేర్చుకునే సందర్భంలో ఆయన చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు.