ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, ప్రారంభం వూహించినట్టే ఘనంగా గోచరిస్తున్నాయి. ప్రారంభ ప్రసంగాలలో పద్యాలు పాటలతో ముఖ్యమంత్రి కెసిఆర్ అలరించారు. ప్రాంతీయ కోణాలు కూడా గమనంలో వుంచుకుని జాగ్రత్తగా మాట్లాడారు గనక మామూలుగ వుండే జోరు కొంచెం తగ్గివుండొచ్చు. గురువులు నేర్పిన తెలుగునూ పోతన పద్యాలనూ శతక పద్యాలను ధారాళంగా ఉటంకించారు. గోరటి వెంకన్న గల్లీ చిన్నది పాట చరణం పాడితే సభికులు చప్పట్లు మోగించారు. అయితే సుద్దాల హనుమంతును మినహాయిస్తే తెలంగాణ పోరాట కాలాన్ని కవిత్వాన్ని ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. మరీ ఎక్కువ సేపు మాట్లాడలేదు కూడా. వున్నంతలో సంప్రదాయం పైన, పద్యాలపైన ఆయన మోజు ప్రస్పుటమైంది. తెలంగాణ సాహిత్య ప్రాశస్త్యాన్ని చెప్పినా భాష పరిధిలోనే మాట్లాడ్డంలో విజ్ఞత అగుపించింది. ఆయనతో పోలిస్తే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే తెలంగాణం ఎక్కువ చేశారు. అదితప్పుకాకున్నా కావాలని చేసిన పనిగా అనిపించింది. పైగా ఆయన ప్రసంగ ధాటిని ప్రాసలను కెసిఆర్ ప్రత్యేకంగా ప్రశంసించిన తర్వాత వెంకయ్య రాసుకొచ్చిన ఉపన్యాసం చదవడంతో చప్పగా మారింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఇతరచోట్ల వున్న తెలుగు వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు.గవర్నర్ నరసింహన్ గతంలో లాగే తనదైన తెలుగులో చదివారు. ఇక మరో ప్రత్యేకాకర్షణ అసదుద్దిన్ ఒవైసీ తెలుగు ప్రసంగం. నాలుగు మంచి ముక్కలు చెప్పారు. బహుభాషలు సంసృతులను కాపాడాలని కోరారు. అంతా అయిన తర్వాత తన మాటల్లో తప్పులుంటే మన్నించాలని ఉర్దూలో ముగించారు. సభా సమన్వయం చేసిన రమాణాచారికి ఇలాటివి కొట్టిన పిండి గనక అన్ని కోణాలు తెలిసిన వారు గనక ఒవైసీ సంస్కారాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సభకు భారీగానే ప్రజలు హాజరైనారు. ఒక్క వివాదాంశం కూడా లేకుండా తెలుగుదనం నింపడం ఆహ్వానించదగిందే.