మహా విజ్ఞానానికి కేంద్రబిందువు మకర సంక్రాంతి
ఇది వ్యవసాయ కేలెండర్ పుట్టుక కథ
పున్నమినుంచి అమావాస్యకీ, అమావాస్య నుంచి పున్నమికీ చంద్రబింబం ఒక క్రమపద్ధతిలో తగ్గుతూ హెచ్చుతూ వుంటుంది…చంద్రుడి హెచ్చుతగ్గుల కళలను బట్టి రోజుల్ని (తిధులు) లెక్కపెట్టడం చంద్రమానం. ఇది వ్యవసాయానికి అవసరమైన రుతువుల్ని సూచించదు.
రుతువులు సూర్యుణ్ణి అనుసరిస్తాయి. సూర్యుడికి కళలు వుండవు. అందువల్ల సూర్యమానాన్ని లెక్కించడానికి కొంత నిపుణత కావాలి.వ్యవసాయ తరుణాన్ని,అదును పదునుల్ని ప్రమాణికం చేయడానికి, ఏపరికరాలూ లేని యజుర్వేద కాలంలో పరంపరగా సాగిన నిరంతర పరిశీలన పరిశోధనలనుంచి మానవ మేధస్సు సాధించిన మహా విజ్ఞానమే ఈ కేలండర్
తూర్పునుంచి పడమరకు సూర్యుడు తిరిగే (తిరుగుతున్నాడనిపించే) దారి భూమికి నడినెత్తిమీద వుండదు…సూర్యుడు భూమి నెత్తి మీద ఆరునెలలు దక్షిణం వైపు ఆరునెలలు ఉత్తరం వైపు జరుగుతూ వుంటాడు. ఇదే దక్షిణాయణం, ఉత్తరాయణం…
ఇలా ఆయన అటూ ఇటూ తిరిగే సమయంలో ఉత్తర దక్షిణాల మధ్య భూమి నడినెత్తికి దగ్గర గా వుండే కాలాన్ని / సమయాన్ని గుర్తించారు. అదే జనవరి 14లేదా15. అదే మకర సంక్రమణం. దక్షిణం చివరి నుంచి ఉత్తరం చివరి వరకూ సూర్యుడి ప్రయాణ మార్గాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. సూర్యుడు ఏభాగంలో ఉన్నాడన్నదాన్ని బట్టి అది ఏరుతువో తెలుసుకోవచ్చు…
సూర్యయానాన్ని 27 భాగాలుగా విభజించారు…ఒకోభాగానికీ ఒకో నక్షత్రం పేరుపెట్టారు… గ్రీకు ప్రభావంతో దీన్నే 12 భాగాలు గావిభజించి ఒకో భాగాన్నీ ఒకో రాశిపేరుతో పిలిచే పద్ధతి కూడా మనదే…సూర్యమానంలో రాశుల్నీ నక్షత్రాల్నీ సమన్వయం చేసుకుని రోజులతో సహా రుతువుల కేలెండర్ ని డెవలప్ చేశారు. ఆవిధంగా సూర్య యానం జనవరి 14 నుంచి ప్రారంభమౌతుంది
వ్యవసాయదారుల కోసం పుట్టుకొచ్చిన కేలెండర్ లో రాహుకాలాలూ యమగండాలు బల్లిశకునాలు దుర్ముహూర్తాలూ చేరిపోయి పంచాంగమైంది…రుతువుల సమయాసమయాలు గుర్తించే ఖగోళ విజ్ఞానంలో రాశులు గ్రహాలు మనుషుల పుట్టుక సమయాలతో ముడిపడి జ్యొతిష పంచాంగమైంది.