భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు! ఎప్పటికప్పుడు రాష్ట్ర భాజపా నేతలు ఇదే చెబుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇదేమాట చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలపై ఎంతమంది ఎన్నిరకాలుగా దుష్ప్రచారం చేసినా ప్రజలు భాజపాకే పట్టం కడుతున్నారనీ, ఆ సంస్కరణ ఫలాలను ఈరోజున సామాన్య ప్రజలు అందుకుంటున్నారనీ, అందుకే ఆదరిస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటంతో భాజపాకి పెద్దగా ఆదరణ లభించలేదన్నారు. రాష్ట్రంలో 17 శాతం ఓట్లు దక్కించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయన్నారు. ప్రజలు అభివృద్ధి వైపే చూస్తున్నారనీ, తెలంగాణలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో మూడు రోజులు రాష్ట్రానికి వస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారనీ, ఇకపై అమిత్ షా ఫోకస్ అంతా తెలంగాణలో పార్టీ బలోపేతంపైనే ఉంటుందన్నారు. ఆ తరువాత, ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తారనీ, ఇకపై వరుసగా ఆయన సభలు ఉండేలా వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు.
ఆపరేషన్ ఆకర్ష్ ను మరోసారి తెరమీదికి తెచ్చేందుకు అమిత్ షా సంకేతాలు ఇచ్చారని సమాచారం! తన పర్యటన సందర్భంగా నేతల చేరిక ఉంటే బాగుంటుందనీ, ఫిబ్రవరిలో జరిగే మోడీ సభలో కూడా కొత్త నేతల చేరిక ఉండాలంటూ ఆయన రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం! నిజానికి, గడచిన అక్టోబర్ నెలలోనే భాజపాలో చేరికలు ఉంటాయని అనుకున్నారు. అప్పుడు కూడా అమిత్ షా వస్తున్నారనీ, ఆయన సమక్షంలో కొందరు నేతలు చేరుతారనీ, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలను లక్ష్యంగా చేసుకుని భాజపా ఆకర్ష్ మిషన్ నడుస్తోందనీ బాగానే ప్రచారం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరేసరికి.. సీన్ మారిపోయింది. భాజపా వైపు మొగ్గుచూపిన కొంత నేతాగణాన్ని కూడా కాంగ్రెస్ ఆకర్షించేసింది. దాంతో నాటి మిషన్ మధ్యలో ఆగిపోయినట్టయింది. మరి, ఇప్పుడు మరోసారి ఆకర్ష్ ను తెరమీదకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఈసారైనా అమిత్ షా తెలంగాణ వ్యూహం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. విచిత్రం ఏంటంటే… రాష్ట్రంలో భాజపా విస్తరణ అంటే, ఇతర పార్టీల నుంచి నాయకుల్ని ఆకర్షించడమేనా..? ప్రజాదరణ పెంచుకునే ప్రయత్నాలకు ద్వితీయ ప్రాధాన్యమేనా..?