ప్రతీ హీరోకీ కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. దాన్ని మిగిలిన హీరోలు ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కాకపోతే.. పవన్ మ్యానరిజమ్స్ వేరు. అవి పవన్‌కి మాత్రమే సొంతం.
ఉదాహరణకు తమ్ముడు సినిమాని గుర్తు చేసుకోండి. అందులో ఫోన్లో హీరోయిన్ కి బిల్డప్పులిస్తూ.. చెప్పే డైలాగ్ ఉంది. ‘శకుంతలక్కయ్యా… ‘ అంటూ మూతు విరుచుకున్న షాట్, అప్పటి పవన్ మేనరిజం సింప్లీ సూపర్బ్. సాధారణంగా ఓ ఇమేజ్ వచ్చిన.. వస్తున్న హీరోలు ఆ టైపు కామెడీ పండించడానికి బాగా మొహమాట పడిపోతారు. కానీ పవన్ అలా కాదు. ‘ఖుషీ’నే తీసుకోండి. అలీతో మందు తాగి.. రచ్చ రచ్చ చేస్తాడు. భూమిక అదంతా గమనించి, నాలుగు చివాట్లు వేసి వెళ్లిపోతుంది. ఆ తరవాత వచ్చిన అలీని ఆడుకుంటాడు పవన్. ‘పాడు సచ్చినోడు..’ అంటూ ఓ ‘టైపు’ డైలాగ్ చెబుతాడు. అదీ అభిమానుల్ని ఆకట్టుకొనేదే. అంతెందుకు ‘అత్తారింటికి దారేది’ గుర్తుంది కదా? అందులో చీర కట్టుకొని చిందులేశాడు. ఓ స్టార్ హీరో.. పవన్ అంత స్టామినా ఉన్న హీరో.. ఇవన్నీ చేయడం విడ్డూరంగా అనిపిస్తాయి. కానీ పవన్ ఫ్యాన్స్‌కి అదే కిక్కు. దాన్ని కంటిన్యూ చేయించడానికా అన్నట్టు.. ‘అజ్ఞాతవాసి’లోనూ అలాంటి మ్యాజిక్ చేయించాడు త్రివిక్రమ్. పవన్ అభిమానులకు ఏం కావాలో త్రివిక్రమ్‌కి బాగా తెలుసు. పవన్ ఏం చేయగలడో కూడా తెలుసు. దాన్ని పూర్తి స్థాయిలో వాడుకున్నట్టు టీజర్ చూస్తే అర్థమైపోతోంది. పవన్ ఏడుస్తున్నట్టు నటిస్తున్న దృశ్యం, అమ్మాయిలా గుడ్లు మిటకరిస్తున్న షాట్… ఇవి రెండూ.. పవన్ ఫ్యాన్స్‌ని గిలిగింతలు పెట్టించేవే.
టీజర్ కట్ చేయడంలో త్రివిక్రమ్ తెలివితేటలు నిండుగా కనిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి అనే గంభీరమైన టైటిల్ పెట్టుకొని, సెంటిమెంట్ డైలాగులు దట్టించాల్సింది పోయి – ఈ సినిమాలో ఏమాత్రం వినోదం ఉండబోతోందో చూపించే ప్రయత్నం చేశాడు. అత్తారింటికి దారేది ఫార్మెట్ కూడా అదే కదా?? తాను చెప్పదలచుకున్న సీరియెస్ పాయింట్‌ని, తనదైన కామెడీ టైమింగ్‌తో పవన్‌తో చెప్పించాడు. సేమ్ టూ సేమ్… ఇప్పుడు అజ్ఞాత వాసిలోనూ అదే జరగబోతోందేమో అనిపిస్తోంది. ‘అత్తారింటికి దారేది’ రికార్డులు బద్దలై… కొత్త రికార్డులు లిఖించడానికి ఇంకెన్నో రోజులు లేవేమో అనిపిస్తోంది.