వరంగల్ లో దిల్‌రాజుకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయన నిర్మించిన ఎంసీఏ షూటింగ్ మొత్తం వరంగల్ లోనే తీశారు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అక్కడే నిర్వహించాలనుకున్నారు. ఈరోజు వరంగల్‌లో కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే అక్కడికి వచ్చిన ప్రేక్షకుల్ని అదుపు చేయడం చాలా కష్టమైంది. ఎవరు మాట్లాడుతున్నా.. అరచి గోల పెట్టారు. దాంతో ఓ సందర్భంలో దిల్‌రాజు సహనం కోల్పోయాడు. ఇలాగైతే వరంగల్ వచ్చేది లేదు, ఇక్కడ షూటింగులు చేసేది లేదు… అంటూ అక్కడి వాళ్లకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి ఇలాంటి స్టేట్మెంట్లు.. ఓ వేదికపై, దిల్‌రాజు లాంటి నిర్మాత చేయడం ఇబ్బంది కరమే. అందుకే చివర్లో నాని మాట్లాడుతూ కాస్త కవరింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ”వరంగల్‌లో షూటింగులు చేయం, అదీ ఇదీ అని… దిల్‌రాజుగారు ఏవో చెబుతుంటారు. మేం అంతదూరం నుంచి ఇక్కడి వచ్చింది మీరు కామ్ గా ఉంటే చూడ్డానికా..” అంటూ కాస్త శాంతపరిచే ప్రయత్నం చేశాడు. వరంగల్ వాసులు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేనిదని, ఇంటి నుంచి దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా చేశారని నాని కితాబులు ఇచ్చాడు. అయితే.. అక్కడి కొచ్చిన కుర్రాళ్లు మాత్రం వేదిక చుట్టు పక్కల చేరి హడావుడి చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఎంసీఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చివర్లో కాస్త గందరగోళం నెలకొంది. నాని కూడా తన ప్రసంగం హడావుడిగా ముగించాల్సివచ్చింది. దిల్ రాజు కామెంట్లకు అక్కడి వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.