నిర్మాత సురేష్ బాబు ఈ మధ్య ప్రెస్ తో మాట్లాడుతూ, తాను సమర్పకుడుగా వ్యవహరించిన “మెంటల్ మదిలో” సినిమా కి ఆశించినంత కలెక్షన్స్ రాకపోవడానికి ఆ సినిమా టైటిల్ కూడా ఒక కారణమే అని చెప్పారు. ఆ టైటిల్ సినిమాకి , కథ కి యాప్ట్ అయినప్పటికీ ఆడియెన్స్ ని థియేటర్ దాగా రప్పించడానికి ఆ టైటిల్ ఉపయొగపడలేదని వ్యాఖ్యానించాడు. నిజానికి ఆయన వ్యాఖ్యల్లో నిజముంది. ఆయన వ్యాఖ్యలు చూసినపుడు కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు భారతీరాజా గురించి రచయిత, దర్శకుడు జంధ్యాల చెప్పిన విషయాలు గుర్తొస్తున్నాయి. జంధ్యాల చెప్పిన విషయాలు :
దర్శకుడు భారతీ రాజా గారు మురళి (తర్వాత కార్తీక్ అయ్యాడు), అరుణ ని హీరోహీరోయిన్స్ గా పెట్టి ఒక మంచి లవ్ స్టొరీ ప్లాన్ చేసారు, 90 శాతం షూటింగ్ కూడా అయింది. ఈ సినిమా కి జంధ్యాల మాటల రచయిత. అప్పటికింకా జంధ్యాల దర్శకుడిగా మారలేదు. అయితే ఈ సినిమా కి టైటిల్ ‘సాగర సంగమం’ అయితే బాగుంటుంది అని జంధ్యాల భావించారు.అప్పటికింకా కె. విశ్వనాథ్ గారి సాగర సంగమం సినిమా రాలేదు. భారతీ రాజా గారితో జంధ్యాల గారు చెప్పారట -“ఇది ఒక ప్రేమ కథ..ఒక హిందూ అబ్బాయి కి, ఒక క్రిస్టియన్ అమ్మాయి కి మధ్య ప్రేమ కథ. ఈ రెండు మతాలు రెండు నదులు లాంటివి అయితే ప్రేమ అనే సాగరసంగమం వద్ద నదుల లాంటి ఈ రెండు మతాలు కలవడమే ఈ చిత్ర ఇతివృత్తం. కాబట్టి ఈ సినిమా కి సాగరసంగమం టైటిల్ అయితే బాగుంటుంది ” అని. అందులోనూ అప్పటికే “సాగర సంగమమే..” అనే పాట కూడా ఈ చిత్రం కోసం రికార్డ్ చేసి షూట్ చేసారు. కాబట్టి అన్నివిధాలా ఈ సినిమా కి సాగరసంగమం అనేది అత్యంత యాప్ట్ టైటిల్ అని భావించారు జంధ్యాల.
అయితే దీనికి భారతీ రాజా గారిచ్చిన సమాధానం జంధ్యాల గారిని అబ్బురపరచిందట! ఇంతకీ భారతీ రాజా గారిచ్చిన సమాధానమేంటంటే – ” ఈ సినిమా కి కథాపరంగా సాగర సంగమం అనే టైటిల్ యాప్ట్ అయి వుండొచ్చు, అంత చక్కని టైటిల్ పెట్టామనుకుని మనం సంబర పడిపోవచ్చు..కానీ ఒక్క సారి ప్రేక్షకుడి వైపు నుంచి ఆలోచింఛండి. సాగర సంగమం అనే టైటిల్ చూడగానే ఇదేదో బాగా బరువైన కథ వున్న సినిమా అనుకుంటారు. మనది ప్రేమ కథ. కుర్రాళ్ళని ఆకట్టుకునేలా టైటిల్ వుండాలి కానీ వాళ్ళని బెదరగొట్టేలా కాదు..సాగర సంగమం అన్న టైటిల్ చాలా మంచి టైటిల్. మన సినిమా కథ కి కూడా చక్కగా సూట్ అయ్యే టైటిలే..కానీ మనం ఆ టైటిల్ ని మన సినిమా కి పెట్టలేము..”
ఆ ఇంటర్వ్యూ లో జంధ్యాల గారు భారతీరాజా గారి విజన్ ని ప్రశంసిస్తూ..ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత సురేష్ బాబు గారికి అదే తరహా సమస్య ఎదురవడం ఆశ్చర్యం!!