హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలూ సంయుక్తంగా ఈ సభల్ని నిర్వహిస్తే బాగుండేది. తెరాస సర్కారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించకపోవడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. నిజానికి, మహాసభల నిర్వహణ గురించి చర్చిస్తున్న దశలోనే సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయమై ప్రస్థావించారనీ, చంద్రబాబును ఆహ్వానిద్దామని అనుకున్నారనీ కథనాలొచ్చాయి. కానీ, చివరికి వచ్చేసరికి ఎవ్వరూ చంద్రబాబు ఆహ్వానం మాట ప్రస్థావించడమే మానేశారు. కేసీఆర్ కూడా ఆ ప్రస్థావన తీసుకురాలేదు. ఇంతకీ.. చంద్రబాబును ఎందుకు ఆహ్వానించలేదు అనే అంశంపై ఇప్పుడు కొంతమంది అధికారుల ద్వారా లీకులు ఇచ్చే ప్రయత్నం తెరాస సర్కారు చేస్తోందని చెప్పాలి.
తెలుగు మహాసభల విషయమై ఇద్దరు ముఖ్యమంత్రులూ సదవగాహనతోనే ఉన్నారనీ, చంద్రబాబు రాకపోవడాన్ని పెద్ద చర్చనీయం కాకుండా మొదట్నుంచీ జాగ్రత్తలు పడ్డారని కొందరు అధికారులు చెబుతున్నారు! సభల నిర్వహణకు ముందే చంద్రబాబు షెడ్యూల్ గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారనీ, మహాసభల చివరి రోజు 19న రాష్ట్రపతి కూడా వస్తున్నారు కాబట్టి, ఆరోజున చంద్రబాబును పిలిస్తే బాగుంటుందని అనుకున్నారట. అయితే, ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబుతో కాకుండా, కొంతమంది సన్నిహిత వర్గాల ద్వారా తెలంగాణ సర్కారు వాకబు చేస్తే.. అప్పటికే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఫిక్స్ అయిపోయాయని తెలిసిందట. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబును పిలిస్తే… రాలేరు కాబట్టి, అధికారికంగా ఆహ్వానించినా హాజరుకాలేదన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వడమెందుకూ అని ఆయన్ని పిలవలేదని తెలంగాణ అధికార వర్గాలు వివరణ ఇస్తున్నాయట!
అధికార వర్గాల వివరణ ఎంత కన్వీనియంట్ గా ఉందో! తెలుగు మహాసభలు అనేవి హటాత్తుగా చోటు చేసుకున్న పరిణామం కాదు కదా! ఇంత భారీ కార్యక్రమానికి కొన్ని నెలల ముందే తేదీలు ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడే చంద్రబాబు షెడ్యూల్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం ఈ అధికార వర్గాల ద్వారా తెలంగాణ సర్కారు చేసిందా..? మహాసభల తేదీలు ఖరారు చేసిన నాడే నేరుగా చంద్రబాబుతో సంప్రదించి ఉండొచ్చు కదా. ఆయన సన్నిహిత వర్గాలతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది..? తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహించుకోవాల్సిన కార్యక్రమం ఇది. చంద్రబాబు గైర్హాజరీపై కచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆయన బిజీగా ఉన్నారనే విషయాన్ని ముందుగా తెలుసుకుని, రాలేకపోయిన పరిస్థితి ఆయనకి ఉంది కాబట్టే ఆహ్వానం పేరుతో ఇబ్బంది కలిగించకూడదనే ముందు చూపుతో వ్యవహరించినట్టు చెబుతున్న ఈ వివరణ… కంటి తడుపు చర్యగానే కనిపిస్తోంది. జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇది సరిపోతుందా..?