కాంగ్రెస్ పార్టీలో భిన్నధ్రువాలు అనగానే.. అందరికీ గుర్తొచ్చేది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి! నిజానికి, ఈ ఇద్దరూ ఒకే జిల్లాకి చెందిన వారే. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతలే. కానీ, వీరి మధ్య విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తమ్ నాయకత్వంలో పనిచేయడం కోమటిరెడ్డికి నచ్చదు. పార్టీలో కోమటిరెడ్డి వ్యవహార శైలిపై ఉత్తమ్ కి గిట్టదు. ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయలేకపోతోందన్నది కోమటిరెడ్డి వాదన. అందుకే, తనకు పీసీసీ అధ్యక్ష స్థానం అప్పగించాలంటూ బహిరంగంగానే కోమటిరెడ్డి హైకమాండ్ ను కోరిన సందర్భాలున్నాయి. పార్టీ కోసం మూడు దశబ్దాలుగా అంకితభావంతో పని చేస్తున్నాననీ, మరింత అంకిత భావంతో పనిచేయాలన్న ఉద్దేశంతోనే పదవి అడుగుతున్నానని కోమటిరెడ్డి అంటారు. అయితే, ఆయన పదవి ఆశించడంలో తప్పులేదుగానీ.. అదే విషయాన్ని పదేపదే ప్రస్థావిస్తూ పార్టీలో ఐక్యతకు గండి కొడుతున్నారన్నది ఉత్తమ్ అభిప్రాయం. ఇలా ఈ ఇద్దరు నేతలూ భిన్నధ్రువాలుగా ఉన్నారు.
వీరిద్దరు కలిసి పనిచేసే వాతావరణం ఉంటుందంటే ఆ పార్టీ వారే సరిగా నమ్మరు! అయితే, పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో.. ఈ ఇద్దరూ కలిసి ముచ్చటించుకోవడం విశేషం. ఈ ఇద్దరినీ ఒకచోట చూడగానే మీడియా పకలరించింది. విభేదాల గురించి ప్రస్థావించేలోగానే.. ఇదంతా మీ మీడియా సృష్టేననీ, పార్టీలో అందరమూ ఎంతో ఐకమత్యంతో ఉన్నామని ఉత్తమ్ అన్నారు. పక్కనే ఉన్న కోమటిరెడ్డి కూడా తగ్గలేదు! ఉత్తమ్ చెప్పినట్టుగానే, తమ మధ్య విభేదాలనేవి మీడియా కల్పితాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అనే ఏకైక లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఐక్యతా రాగం వినిపించారు!
ఈ ఇద్దరు నేతలూ కలిసిమెలిసి కనిపించడం వరకూ బాగుంది. కలిసి పనిచేస్తామని చెప్పడమూ ఓకే. కానీ, వారి మధ్య విభేదాలు మీడియా కల్పితం అనడం విడ్డూరంగా ఉంది! విభేదాల అంశాన్ని ప్రస్థావించగానే.. దాన్ని దాటవేయడం కోసం మీడియాను సాకుగా చెబుతున్నట్టు ఇట్టే అర్థమైపోతోంది. కనీసం రాహుల్ నాయకత్వంలో అయినా తెలంగాణ నేతలు ఐక్యంగా ఉంటామంటే కాదనేవారు ఎవరుంటారు..? ఈ నేతల ప్రకటనలు ఢిల్లీ వరకూ పరిమితం అవుతాయా.. రాష్ట్రానికి వచ్చాక కూడా ఢిల్లీ ప్రదర్శించిన ఐక్యతను కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి.