ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగానే జరుగుతున్నాయి. వేల సంఖ్యలో ప్రతినిధులు ప్రేక్షకులు హాజరవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారు ఆన్‌డ్యూటీ సంతకం చేసేందుకు రవీంద్రభారతిలోనే ఏర్పాట్టు చేశారు. మొత్తానికి సభా వేదికలన్నీ కిక్కిరిసి వుండటం విశేషం. చాలా పెద్ద ప్రచారంతో ఏర్పాట్లతో సభలు జరపడం వల్లనే ఇది సాధ్యమైంది. అనంతపురం నెల్లూరు కడప ఏలూరు విశాఖ శ్రీకాకుళం వంటి చోట్ల నుంచి కూడా వచ్చిన అనేక మంది మిత్రులు కలిశారు. యువత పెద్ద భాగంగా వున్నారు. తెలంగాణ ఆంధ్ర మిత్రులు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో నాతో ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు. ఇటీవల వైజాగ్ ఫెస్ట్‌కు వెళ్లినప్పటి అనుభవమే పునరావృతమైంది. పుస్తకాలు కూడా బాగా తీసుకుంటున్నారు. ఇదంతా బాగానే వుంది గాని మహాసభల్లో చాలా మంది మిత్రులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పొగడ్డానికి పోటీ పడుతున్న తీరు విసుగు తెప్పిస్తున్నది. మర్యాదగా గౌరవంగా రెండు మాటలు చెప్పడం వేరు. ఒక మూస ధోరణిలో భజన చేయడం వేరు. రెండు రోజులుగా సభల్లో పాల్గొంటున్నా చాలామంది విషయం వదిలేసి పొగడ్దలకు పరిమితమవుతున్నారని నా పక్కనకూచున్న పాత్రికేయ మిత్రుడన్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఇది కోరుకుని వుండదేమో. అతిగా పొగిడితే అందుకోసమే వారిని రప్పించారన్న విమర్శ వారిపై వస్తుంది కూడా. ఇకముందైనా విషయ ప్రధాన ప్రసంగాలు పెరగాలని కోరుకుందాం. తెలంగాణ అనగానే గుర్తుకువచ్చే కమ్యూనిస్టులు సాహిత్యంపై వారి ప్రభావం గురించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేకంగా చెప్పడంతో విశేషం. కెసిఆర్ వంటివారు కావాలనే విస్మరించిన అంశాన్ని ఈ విధంగా ఆయన సరిచేశారన్నమాట. లేక ఆయనకు అదే పని చెప్పారేమో కూడా తెలియదు.ఎలాగైనా సరే మంచిదే.