జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా, ఆంధ్రాలో పర్యటించి, కొన్ని అంశాలపై స్పందించారు. ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణ పర్యటనపై ఉందని సమాచారం. దీనికి అనుగుణంగా జనసేన వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో పవన్ పర్యటన ఏ విధంగా ఉండాలీ, ఏయే అంశాలపై మాట్లాడాలీ వంటి అంశాలపై జనసేన వర్గాల మేథోమథనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉస్మానియా విద్యార్థి మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇదివరకే పవన్ చెప్పారు. దీంతోపాటు విద్యార్థులు, రైతులు, దళితులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ పర్యటనలో పవన్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, పార్టీపరంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే 17 పార్లమెంటు నియోజక వర్గాలకు పార్టీ సమన్వయ కర్తల్ని నియమించారు. దీంతోపాటు పార్టీ విద్యార్థి, యువజన, మహిళా విభాగం నియామాకాలు కూడా దాదాపు పూర్తయినట్టే అని తెలుస్తోంది. గతంలో యువరాజ్యంలో పనిచేసిన వారిని కూడా తిరిగి జనసేనలోకి ఆహ్వానించాలని పవన్ భావిస్తున్నారట. ప్రస్తుతం టీడీపీతోపాటు లోక్ సత్తా వంటి పార్టీల్లో ఉన్న పాత యువరాజ్యం నేతల్ని త్వరలోనే ఆహ్వానించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ తెలుస్తోంది. తెలంగాణ జనసేనకు ఇప్పటికే శంకర్ గౌడ్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డిని జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ముందుగా, సంస్థాగతంగా పార్టీ తెలంగాణ విభాగాన్ని పటిష్టం చేయడంపైనే పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నియామకమైన విభాగాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. దీంతోపాటు పవన్ పర్యటన షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ కార్యాలయానికి కావాల్సిన స్థలాన్ని గచ్చిబౌలీలో గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. నిజానికి, తెలంగాణ వచ్చిన తరువాత ఇక్కడి అంశాలపై పవన్ పెద్దగా స్పందించింది లేదు. ఒకంట్రెండు అంశాలు మినహా, సోషల్ మీడియా మీదే ఎక్కువగా ఆధారపడ్డారు. ఆంధ్రాతోపాటు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా పోటీ చేస్తానని చెబుతున్నారు. అంటే, మరో ఏడాదిలో తెలంగాణలో కూడా పార్టీ నిర్మాణాలూ ఏర్పాట్లూ నాయమకాలు అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పవన్ పర్యటన తరువాత ఈ అంశాలన్నింటిపైనా కొంత స్పష్టత వస్తుందని అనుకోవచ్చు!