ప్రపంచ తెలుగు మహాసభల్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యల్లో కవులూ, కళాకారులను ఆహ్వానించేశారు. ఇక, వచ్చినవారికి జరుగుతున్న మర్యాదలు ఏస్థాయిలో ఉన్నాయని తెలియజేయడానికి ఈ ఒక్క ఘటన చాలు! ఈ సభల్లో భాగంగా దాదాపు 8 వేల మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలూ వివిధ అంశాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ముందుగానే పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ అవకాశం ఇవ్వాలంటే.. ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉండాలి..? పెద్ద సంఖ్యలో వేదికల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరే, ఆ ముందుచూపు మొదట్నుంచీ లేకపోయినా… వచ్చినవారిని తగు రీతిన సన్మానించి పంపినా కొంత బాగుండేది. అదీ కూడా లోపించడంతో మహాసభల్లో తమకు అవమానం జరిగిందంటూ కొంతమంది కవులూ కళాకారులు తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకే ఒక్క శాలువ, ఒకే ఒక్క పుష్ఫగుచ్ఛంతో 250 మందికి సన్మానాలు చేశారు! అవునండీ.. అందుకే తామంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి మహాసభలకు వచ్చామనీ, కానీ తమ రచనల్ని చదివే అవకాశమే దక్కడం లేదని వారంటున్నారు. తామంతా ముందుగానే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకున్నామని చెబుతున్నారు. తెలుగు యూనిర్శిటీలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారని తెలియగానే అక్కడి వెళ్లామనీ, అక్కడ తమని వరుసగా కూర్చోబెట్టి మొక్కుబడిగా సన్మానాలు చేశారనీ, ఒక శాలువాగానీ పుష్పగుచ్ఛంగానీ ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఈ సందర్భంగా వీసీ తీరుపై కూడా కవులు మండిపడుతున్నారు. నమోదు చేసుకున్న 8 వేల మందికి అవకాశం ఇవ్వాలంటే 80 రోజులు పడుతుందని తెలుగు వర్శిటీ వీసీ సత్యనారాయణ అంటున్నారు. శాలువ, నగదు, బొకేలు ఇవ్వాలంటూ గొంతెమ్మ కోరికలు కోరొద్దనీ, సిగరెట్ పెట్టె మీద కవితలు రాసుకొచ్చినవారు కూడా అవకాశం కోరితే ఇవ్వలేమని అభిప్రాయపడ్డారు.
తెలుగు మహాసభల ఏర్పాట్లలో మొదట్నుంచీ నెలకొన్న గందరగోళానికి ఫలితమే ఈ పరిస్థితి. ప్రదర్శనల కోసం 8 వేలమంది దరఖాస్తు చేసుకుంటే… అంతమందికి అవకాశాలు ఇవ్వలేమన్న అంచనా నిర్వాహకులకు ముందే ఉండాలి కదా..? లేదా, భారీ సంఖ్యలో వేదికలైనా ఏర్పాట్లు చేయాలి. అంశాల వారీగా కొందరికే అవకాశం ఇస్తామని ముందే ప్రకటించాలి. ఇవేవీ సరిగా చేయకుండా.. వేలమంది వచ్చేస్తే ఎలా అంటూ నిర్వాహకులే ఆవేదన వ్యక్తం చేయడం మరీ విడ్డూరం. ఒకే శాలువా, బొకేతో 250 మందిని సన్మానించడం అనేది నిర్వహణలో లోపంతోపాటు, నిబద్ధతను కూడా చెప్పకనే చెబుతోంది.