తెలంగాణాలో పుటిందే అసలు సిసలు తెలుగు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.పాల్కుర్కి సోమన ప్రాంగణం బమ్మెర పోతన్న వేదిక నుండి నిర్వహించిన సాహిత్య సభ లో తెలంగాణాలో తెలుగు బాష వికాసం పై నిర్వహించిన కార్యక్రమం లో కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణాలో పుట్టి తెలుగు బాష వికాసానికి కృషి చేసిన సాహితిమూర్తులను, వారి సాహిత్యాన్ని తెలంగాణా యాస, బాష, సంస్కృతి గొప్ప తనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రపంచ తెలుగు మహా సభలను జరుపుతునట్లు తెలిపారు.
అయితే ఉప ముఖ్యమంత్రి వాదనలో కొన్ని లోపాలు లేకపోలేదు. కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని ఎఱ్ఱగుడిపాడు శాసనము భాషాశాస్త్రవేత్తల దృష్టిలో తొలి తెలుగు శాసనం. దీన్ని క్రీ.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించినాడు. తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) ఇప్పటి వరకూ లభ్యమైన వాటిలో తొలి తెలుగు పదం. అలాగే, ధనంజయుని కలమళ్ళ శాసనం ( కడప జిల్లా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.
ఇలా ఏ శాసనం చూసినా, ఏ పదం చూసినా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అలాంటపుడు స్వయానా ఉపాధ్యాయుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణా లో పుట్టిందే అసలైన తెలుగు అనే వ్యాఖ్య చేయడం సబబు కాదు. ఇంకోవైపు చూస్తే తెలుగు వాళ్ళు ఆదికవి గా పిలిచే నన్నయ తో పాటే ఇటు పాల్కూరికి సోమనాథుడు దాదాపు అదే సమయం లో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. అయితే షుమారు 2 వేల సంవత్సరాల తెలుగు చరిత్ర లో “తెలంగాణా ఆంధ్రా వేర్వేరు” అన్న భావన యొక్క చరిత్ర కనీసం డెబ్బై యేళ్ళు కూడా కాదు. కాబట్టి తెలుగు చరిత్ర గురించి చర్చించేటపుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులని, ప్రస్తుత భావాలని అందులో చొప్పించకపోవడం సమంజసంగా ఉంటుంది.