గుజరాత్లో బిజెపి అత్తెసరు మెజార్టితో సరిపెట్టుకున్నా తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ శ్రేణులు హమ్మయ్య అనుకుంటున్నాయి. పైకి భారీ అంచనాలుచెబుతున్నా ఏ కారణం చేతనైనా అక్కడ ఎదురుదెబ్బ తగిలితే తమ భవిష్యత్తు అయోమయం అన్న ఆందోళన వారి లోలోపల వుండింది. ఆధిక్యతలు కాస్సేపు అటూ ఇటూ వూగిసలాడినప్పుడు అది బయిటపడింది కూడా. అయితే రాజకీయ అనుభవం వున్న వారెవరూ ఒక్కసారిగా కాంగ్రెస్ గెలిచేస్తుందని అనుకోలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన స్థాయిలో కాకున్నా ఎలాగోలా బతికి బయిటపడతారనే భావించారు. బిజెపి నేతలకూ లోపల అదేభావం వుండింది. ఇక కాంగ్రెస్ విషయంలోనూ మరీ అధ్వాన్నంగా ఓడిపోతే అద్యక్ష పీఠం అధిష్టించిన రాహుల్‌గాంధీకి ఆదిలోనే హంసపాదులా మారుతుందనే ఆందోళన వుండింది. ఆ విషయంలో వారికీ వూరట లభించింది. గట్టి పోటీ ఇచ్చారనీ గట్టిగా పోట్లాడారనీ పేరు రావడంతో వారూ సంతృప్తి చెందుతున్నారు.గతంలో ఉత్తర ప్రదేశ్‌లో బీహార్‌లో ఈ మాత్రం ఫలితాలు తీసుకొచ్చినందుకే రాహుల్‌గాంధీకి బ్రహ్మరథం పట్టారు కూడా. ఇప్పుడూ ఆయన రేటింగు పెరగడం తథ్యం. ఇక తెలుగుదేశం నాయకుల విషయానికి వస్తే బిజెపి దూకుడుకు పగ్గాలు పడటం రాష్ట్రంలో తమ వ్యతిరేక వర్గాన్ని దారికి తెస్తుందనే ఆశాభావం వారిలో తొంగిచూస్తున్నది. గుజరాత్ గనక బ్రహ్మాండంగా గెలిచేస్తే ప్రధాని మోడీ తమను అసలే ఖాతరు చేయడన్న భయం వారిలోవుండింది. ఇప్పుడది కొంచెం తగ్గుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఆయన ఈ విజయాన్ని స్వాగతించేట్టయితే బిజెపి పట్ల మెతగ్గా వుంటారని భావించాల్సివస్తుంది.