ఎపి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర 37 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అనంతపురం జిల్లాలో నడుస్తున్నది. అనేక విమర్శలు కోర్టు హాజరు వంటివాటి మధ్య ఆయన పాదయాత్ర సాగడం ఆసక్తికరమైన అంశమే. అయితే మీడియా గతంలో పాదయాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది నిజం. అదే సమయంలో మీడియా ఇవ్వక తప్పని అంశాలను బయిటకు తేవడం, అధ్యయనంతో కొత్త విషయాలు వెల్లడించడం కూడా జరగడం లేదు.వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో ముందూ వెనకా బోలెడు కృషి జరిగేది.ప్రచార యంత్రాంగం పనిచేసేది. మీడియా సంస్థలతో సంప్రదింపులు వారిలో వారికి పోటీ పెట్టి ఇవ్వక తప్పని స్థితి కల్పించడం ఇవన్నీ చూశాం. అప్పటికీ ఇప్పటికి మీడియా రంగంలో మార్పులు నిజమే అయినా వార్తా విలువలో వెనకబడటానికి ఎవరూ సిద్దంగా లేరు. ప్రత్యర్థులకైనా ప్రచారం చేయడానికి వెనుకాడరు.కాని అలాటి వాతావరణం కల్పించడంపై వైసిపి మీడియా వ్యూహం కూడా లోపిస్తున్నది. జగన్ నేరుగా మీడియా వారికి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం, మధ్య మధ్య పిలిపించి మాట్లాడ్డం వంటివి జరగడం లేదు. పాదయాత్ర వెళ్లిన చోట్ల పరామర్శలెంత ముఖ్యమో ఇతర చోట్ల ప్రభావం కూడా అంతే ముఖ్యం. అలాటి మెరుపులు రూపొందించడంలో వైసీపీ విఫలమైనట్టే కనిపిస్తుంది. మిగిలిన యాత్రలోనైనా ఆ విషయంపై దృష్టిపెడితే ఫలితంవుండొచ్చు.