నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. అందుకే… ప్రమోషన్లకు పచ్చ జెండా ఊపేసింది చిత్రబృందం. ఈనెల 24న విజయవాడలో ‘జై సింహా’ ఆడియో నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ముందు హైదరాబాద్, తిరుపతిలలో ఈ వేడుక నిర్వహిద్దామనుకున్నారు. కానీ… బాలయ్య మాత్రం విజయవాడకే ఓటేసినట్టు తెలుస్తోంది. అదే రోజున ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందం తప్ప అతిథులెవరూ హాజరు కావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య స్టిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. వాటిలో బాలయ్య హోరు, జోరు, హుషారు చూస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోతోంది. ఇదో సెంటిమెంట్ సినిమా అన్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్నా.. బాలయ్య పోజులు చూస్తుంటే, బాలయ్య ఫ్యాన్స్‌కి కావల్సిన మసాలా బాగానే దట్టించినట్టు అనిపిస్తోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె.ఎస్ రవికుమార్ నిర్మాత. గౌతమి పుత్ర శాతకర్ణి ఫేమ్ నిరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.