విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను ప్రైవేటీకరించడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విశాఖలో పర్యటించి, ఆ సంస్థ ఉద్యోగులకు బాసటగా నిలిచారు. జనసేన తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు కూడా! తాజాగా ఇప్పుడు అదే అంశంపై మరోసారి పవన్ కల్యాణ్ కొన్ని ట్వీట్లు చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశమై ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులు స్పందించాలని కోరారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ఎంపీలంతా కలిసి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు.
తమిళనాడులో సేలమ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనీ, అయినాసరే ఆ సంస్థను ప్రైవేటుపరం చేయొద్దంటూ ప్రధానమంత్రిని వారు కోరిన విషయాన్ని పవన్ ప్రస్థావించారు. ఇదే స్ఫూర్తితో లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎంపీలకు సూచించారు. అంతేకాదు, తమిళ ప్రజల ప్రయోజనాల కోసం అక్కడి పార్లమెంటు సభ్యులు కృషి చేస్తుంటే, ఏపీ ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం తనకు ఆశ్చర్యం కల్గిస్తోందని చురక వేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాని కూడా పక్కన పెట్టేసిన కేంద్రానికి.. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశం చిన్నదిగా కనిపిస్తున్నట్టుగా ఉందంటూ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత, పార్టీపరమైన అంశాల ప్రాథమ్యంతో రాజకీయాలు చేసేవారికి రోజులు దగ్గరపడే సమయం వచ్చిందన్నారు. నాయకులు విశ్వసనీయతా, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. లేదంటే, జాతి కుల మత ప్రాంతాలకు అతీతంగా యువతరం, భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తించాలన్నారు.
నిజానికి, ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయమై పవన్ తప్ప ఎవ్వరూ పెద్దగా మాట్లాడటం లేదు. నిన్నటివరకూ గుజరాత్ ఎన్నికల ఫలితాలవైపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోయాయి. మరి, ఇకనైనా పవన్ రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తుందో లేదో చూడాలి. పవన్ కోరుతున్నట్టుగా ఆంధ్రాకి చెందిన ఎంపీల్లో కూడా ఏదైనా కదలిక వస్తుందో రాదో చూడాలి. విచిత్రం ఏంటంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి ఏదైనా సమస్యను పవన్ తీసుకెళ్తే వెంటనే స్పందన వచ్చేస్తుంది. అదే, ఏపీ ఎంపీల ద్వారా కేంద్రానికి నివేదించాల్సిన సమస్యలపై పవన్ మాట్లాడితే అంత త్వరగా స్పందన కనిపించదు!