మంచి వేదిక దొరికింది..! మర్యాద లభించింది. మైకు చేతికొచ్చింది..! ఇంకేముంది, వీర హీరావేశం వచ్చేసింది మన తెలుగు సినీ తారలకి! సీన్ పండిచేశారు. సింగిల్ టేక్ లో చితగొట్టేశారు. అయ్యో… ఇదేదో మల్టిస్టారర్ చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి చేస్తున్న రిపోర్టింగ్ కాదండీ బాబు. తెలుగు మహాసభల్లో మన తెలుగు తారల ‘మైకా’వేశం చూసి, ఉప్పొంగుకొస్తున్న సగటు తెలుగువాడి స్పందనో ఆవేదనో అలాంటిదేదో ఇది..! ప్రపంచ తెలుగు మహాసభల్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కారు. దీన్లో భాగంగా తెలుగు సినీ ప్రముఖులను కూడా సర్కారు ఆహ్వానించింది, సన్మానించింది. ఆ తరువాత, హీరోలు ఒక్కొక్కరుగా మైకులు అందుకుని… అందరూ ఒకే స్క్రిప్ట్ తో మాట్లాడారు! పొగడ్తల విషయం ఏమాత్రం తగ్గలేదు.
తెలుగు భాషకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అద్భుతం అని చిరంజీవి అన్నారు. మహాసభలకు ఆహ్వానించేందుకు సీఎం తనయుడు కేటీఆర్ తనకు ఫోన్ చేశారనీ, ఇంగ్లిష్ లో తాను విష్ చేస్తే.. తెలుగు సభల గురించి తెలుగులోనే మాట్లాడుకుందామని కేటీఆర్ చెప్పగానే అవాక్కయ్యానని చిరంజీవి చెప్పారు! భలే చెప్పారు కదా. ఇక, మోహన్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ సాధించిన పోరాట యోధుడు అంటూ కేసీఆర్ ను మెచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ పై కూడా పొగడ్తలు కురిపించేశారు. వెంకయ్య నాయుడు లాంటి వాక్చాతుర్యం కేసీఆర్ కి ఉందంటూ ఆర్. నారాయణ మూర్తి అన్నారు. సభ చూస్తుంటే తేట తెలుగులా ఉందంటూ నాగార్జున చెప్పారు. ఇక, జగపతిబాబు, నరేష్, ప్రభ, జయసుధ… ఇలా వరుసగా అందరూ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచేందుకే సభా సమయాన్ని, వేదికనూ అద్భుతంగా వాడుకున్నారు. గుర్తుపెట్టుకుని మరీ కేసీఆర్, కేటీఆర్ లను మెచ్చుకున్నారు. ఆ అవకాశం రానివారు ట్విట్టర్ లో కేటీఆర్ ను మోసేశారు..!
ఏదైతేనేం, తెలుగు తారలంతా అద్భుతమైన ఐకమత్యం ప్రదర్శించారని చెప్పాలి. తెలుగు భాష పట్ల, లేదా నాయకుల పొగడ్తల పట్లా ప్రదర్శించిన వీరి నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే..! కానీ, ఇదే స్ఫూర్తీ ఇదే తరహా బాధ్యతా తెలుగు సమాజంపైన వీరికి ఉందా అనేదే అసలు ప్రశ్న..? తెలుగు సమాజం సమస్యల్లో ఉన్నప్పుడు, తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ తారాగణం ప్రజలకు అండగా నిలిచారా అనేదే కొంతమందిలో కలుగుతున్న ప్రశ్న..?
తెలంగాణ ఉద్యమం విషయమే తీసుకుంటే… ఆ సమయంలో పల్లెత్తి మాట్లాడిన తారలు ఎవరైనా ఉన్నారా..? కోట్లమంది ప్రజల ఆకాంక్షతో ఉద్యమం జరుగుతుంటే, ఎవ్వరైనా స్పందించారా..? ఈ నోళ్లు అప్పుడు ఎందుకు మూగబోయాయి..? ఈ ట్వీట్లు అప్పుడెందుకు కనిపించలేదు..? ఇక, ఆంధ్రా విషయానికొస్తే… ప్రత్యేక హోదా ఉద్యమంపై రాష్ట్రం రగిలిపోయిన సందర్భం ఒకటి వచ్చింది. ఆ సందర్భంలో ఆంధ్రులకు నైతిక మద్దతుగా ఈరోజున ప్రసంగాలు దంచేస్తున్నవారిలో ఎవరైనా నిలిచారా..? పవన్ మీద అభిమానం పేరుతో ఒక్క నితిన్ మాత్రం, ఏపీ ప్రత్యేక హోదాకి మద్దతుగా మాట్లాడాడు. కనీసం ఆ తరువాత కూడా ఇతర తారలు స్పందించింది లేదు. ఇక, విపత్తుల విషయంలో తీసుకుంటే… హుద్ హుద్ వచ్చినప్పుడు, వెంటనే మన తారల్లో స్పందన రాలేదు! ఎవరో ఎక్కడి నుంచో ఒకరు ముందుగా స్పందిస్తే.. ఆ తరువాత చైతన్యం తెచ్చుకున్నారు. పక్కరాష్ట్రం తమిళనాడుని తీసుకుంటే.. జల్లికట్టు అనగానే యావత్ సినీ ప్రపంచమూ మెరీనా బీచ్ కి వచ్చేసింది. అలాంటి కలిసికట్టు తనం మన తారల నుంచి ఆశించలేం! అలాంటి సామాజిక అంశాల పట్ల ఇలాంటి చురుకుదనం మనవారిలో కనిపించదేం..?
ఏ అంశాలపై మాట్లాడితే వివాదాస్పదం కాదో, ఏ అంశాలపై స్పందిస్తే తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందిరాదో, ఏ అంశాలపై లెక్చర్లు ఇస్తే తమ ఇరుకు ఇమేజి చట్రాలకు డామేజీ ఉండదో… అలాంటి సౌకర్యవంతమైన సందర్భాలు ఉంటే మనవాళ్లు ఇలా రెచ్చిపోతారన్నమాట! అప్పుడు సామాజిక బాధ్యత గుర్తొచ్చేస్తుంది, భాషోద్ధణకు కంకణాలు కట్టేస్తారు. అంతేగానీ, తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడూ, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. తమను తారలు చేసి అందలాలకు ఎక్కించిన ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వాలనే కనీస స్పందన వారి నుంచి రాదే..! ఈరోజు తెలుగు మహాసభల్లో చూపించిన స్ఫూర్తీ, ఉత్సాహం ఇతర సందర్భాల్లో కనిపించదేం..! ఇదే ఓ సగటు తెలుగువాడి కడుపుమంటో ఆక్రందనో.. అలాంటిదేదో ఇది..!