ఒక జట్టు ఆటలో గెలవడానికి రకరకాల కారణాలుంటాయి. అలాగే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడానికి కూడా రకరకాల కారణాలుంటాయి. కానీ కొన్నిసార్లు ఒక ఆటగాడు లేదా ఒక నాయకుడు మొత్తం ఫలితాన్ని మలుపు తిప్పుతూ ఉంటాడు. అప్పట్లో నంద్యాల ఎన్నికల సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలు నంద్యాల ఫలితాన్ని తారుమారు చేశాయని కొంత మంది విశ్లేషకులు అంటూ ఉంటారు. అప్పటిదాకా జగన్ కి అనుకూలంగా అనుకున్న ఫలితాలు కాస్తా అఖిల ప్రియ డ్రెస్సింగ్ విషయంలో రోజా చేసిన కామెంట్స్ కారణంగా టిడిపికి అనుకూలంగా మారిపోయాయని విశ్లేషకులు అంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి విశ్లేషణ ఇప్పుడు మళ్లీ గుజరాత్ ఫలితాల విషయంలో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అలా ఫలితాలు మలుపు తిప్పిన నాయకుడిగా మణిశంకర్ అయ్యర్ పేరు వినిపిస్తోంది
మణిశంకర్ అయ్యర్ ని కొంతమంది “బీజేపీని గెలిపించే కాంగ్రెస్ నేత” అని అంటూ ఉంటారు. కానీ, ఆయన కారణంగానే గుజరాత్లో మరోసారి బీజేపీ విజయం సాధించిందని, కాంగ్రెస్ ఓటమి పాలయిందని విశ్లేషకులు అంటున్నారు. మొదటిదశ పోలింగ్ మరొక్క రోజు ఉందనగా, మోదీని మణిశంకర్ అయ్యర్ ‘నీచుడు’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యే గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని, ఫలితాల తీరును మలుపు తిప్పేసిందని విశ్లేషకులు అంటున్నారు.
అప్పటి వరకూ పరిస్థితి కాస్త కాంగ్రె్‌సకు అనుకూలంగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ, మణిశంకర్ అయ్యర్ ‘నీచుడు’ అనగానే, మోదీ రెచ్చిపోయారు. కాంగ్రెస్ అప్పటి వరకూ తనను తిట్టిన తిట్లను ఏకరువు పెట్టారు. తనను చంపేందుకు అయ్యర్ పాకిస్థాన్ వెళ్లి సుపారీ ఇచ్చి వచ్చారని ఆరోపించారు.
ఆరోపణల నుంచి కాంగ్రెస్ కోలుకుని జవాబు ఇచ్చేసరికి రెండో దశ పోలింగ్ కూడా ముగిసిపోయింది. తాను గుజరాతీనని, అందులోనూ బీసీనని, అందుకే కాంగ్రెస్ తనను నీచుడు అందని, తనను చంపేందుకు సుపారీ ఇచ్చిందనే ఆరోపణలు గుజరాత్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు. అందుకే, బీజేపీ విజయంలో మణిశంకర్ పాత్ర కూడా గణనీయంగానే ఉందంటున్నారు. నిజానికి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయంలోనూ మణిశంకర్ పాత్ర సుస్పష్టమే. అప్పట్లో మోదీని అయ్యర్ ‘చాయ్ వాలా’ అని అభివర్ణించారు. ‘చాయ్ వాలా’ పదాన్నే మోదీ తన బ్రాండ్‌గా మార్చేసుకున్నారు.
మొత్తం ఫలితాన్ని ఇలా ఒక్క నాయకుడు లేదా వ్యాఖ్య తారుమారు చేస్తుంది అన్న విశ్లేషణపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పలు నియోజకవర్గాలలో 1000 లోపు ఓట్లతో అభ్యర్థులు విజయం సాధించడంతో చూస్తుంటే ప్రతి వ్యాఖ్య ప్రతి నాయకుడి పాత్ర కీలకమేనని అర్థమవుతోంది. మొత్తానికి ఇలాంటి ఒకరిద్దరు నాయకులు ప్రత్యర్థి పార్టీల్లో ఉంటే ఆయా పార్టీల విజయానికి మార్గం కాస్త సులభమే.