తెలంగాణ బిజెపి నేతల్లో ఎంఎల్‌ఎల్లో ఎం.వి.ఎస్. ప్రభాకర్ స్టైలే వేరు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సన్నిహితంగా వుండే కమలనేతల్లో ఆయన ప్రథములు. అంతేగాక వ్యాపార వర్గాలు ఢిల్లీ నేతలతో అనుసంధానంలోనూ తనదైన పాత్ర పోషిస్తుంటారు. ఇదేగాక స్వాములూ సాధు సంతులతోనూ ప్రభాకర్ నిత్య సంబంధాలు పోషిస్తూ వారి కార్యక్రమాలకు సంధానకర్తగా వుంటారు. ఇవి కూడా కెసిఆర్‌కు ఇష్టమైన పనులే కదా.. ఈ కారణం వల్లనే కొందరు ఇతర బిజెపి నేతల్లా ఆయన కెసిఆర్‌పై ఒంటికాలితో లేవకుండా జాగ్రత్త పడుతుంటారు. అసలు ఆ పార్టీ రాజకీయ వ్యూహం కూడా అలాటిదే. ఇంతకూ గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని టిబిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. కాని కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ప్రకారమైతే ముందు దాన్ని ఎదుర్కొవాలి కదా.. ఇదే ప్రశ్న ఒక చర్చలో ఎంవిఎస్ను అడిగినప్పుడు ఆయన కుండబద్దలుకొట్టేశారు. ముందు మేము కాంగ్రెస్‌ను చిత్తుచేసి తర్వాత టిఆర్ఎస్ గురించి ఆలోచిస్తామన్నారు. మరి అధికారంలో వుంది టిఆర్ఎస్ కదా అంటే దానిపైనా పోరాడతాము గాని ముందు కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థి అని తేల్చేశారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా మిషన్ తెలంగాణలో తలమునకలవుతున్నారని వార్తలు వస్తుంటే ప్రభాకర్ మాటలు ఆసక్తికరంగా వున్నాయి. మరి అదంతా ఉత్తుత్తి ఆర్భాటమేనా అని అనుమానం వస్తుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోనూ సోము వీర్రాజు వంటి బిజెపి నేతలు టిడిపిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కాని అక్కడ కూడా ఇదే ఫార్ములా అన్వయిస్తారన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకునేది కూడా అదే.