ఇటీవల ఒకరి ఆత్మహత్యకు దారితీసిన డిసిఐ(డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ సమస్య అసాధారణంగా పార్లమెంటులో ఎపి ఎంపిలను ఏకం చేసింది. ఉభయ సభల్లోనూ వివిధ పార్టీల ఎంపిలు కలసికట్టుగా ఈ ప్రైవేటీకరణ ఆపాలని పట్టుపట్టడం ఆశ్చర్యం కలిగించింది. సిఐటియు ప్రధానకార్యదర్శి, రాజ్యసభ ఎంపి తపన్ సేన మొదట అంశాన్ని లేవనెత్తగా టిడిపి వైసీపీ కాంగ్రెస్ ఎంపిలందరూ బలపర్చారు. లాభాల్లో వున్న ఈ కీలక సంస్థను ప్రైవేటు పరం చేయడం సరికాదని వారు నొక్కి చెప్పారట. 7500 కి.మీ.పొడవైన కోస్తా తీరం వున్న ఎపిలో 13 పెద్ద రేవులు 200 మధ్య చిన్నతరహా రేవులకు సేవలందిస్తున్న డిసిఐని వదులుకోవడం రక్షణ పరంగానూ హానికరమని వారు స్పష్టం చేశారు.అంతేగాక సంస్థలో పనిచేస్తున్న1700 మంది కార్మికుల జీవితాలు వీధిన పడతాయి. అలాటివారిలో ఒకరైన వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పర్యటన జరిపారు. ఈ ప్రైవేటీకరణపై కెవిపి రామచంద్రరావు లేఖ కూడా రాశారు. మొత్తంపైన ఇటీవలి కాలంలో ఒక అంశానికి సంబందించి ఎపిలోని ప్రధాన పార్టీలన్నీ ఒకే వైఖరి తీసుకోవడం ఇదే ప్రథమం. ఇదే చైతన్యం ప్రత్యేకహౌదా, పోలవరం, ఫాతిమా కాలేజీ వంటి విషయాల్లోనూ చూపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కదా అని పరిశీలకులు చెబుతున్నారు. కాని అదెలా ఎవరి ప్రయోజనాలు వారివి!