వైఎస్ జగన్ పాదయాత్రకు రావలసినంత ప్రచారం రావడం లేదని వైసీపీ మధనపడుతున్నది. వాస్తవానికి తెలుగు360లో గతంలోనే ఈ అంశం చెప్పుకున్నాం. ఇందుకు మీడియా పోకడలతో పాటు వైసీపీ వ్యూహ రాహిత్యం కూడా కారణమేనని నేనన్నాను. ఈ వారం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని పాదయాత్రపై ఫోకస్ పెంచాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. సాక్షి ఎలాగూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. యాత్రపై మాలాటి వారి వ్యాఖ్యానాలు స్పందనలు తీసుకుంటున్నారు కూడా. ఇవన్నీ రాజకీయంగానే ప్రసారం చేయొచ్చు. ఇదే కారణంతో కావచ్చు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మీడియా గోష్టి నిర్వహించారు. జగన్ పాదయాత్ర విశేషాలు పంచుకున్నారు. అదే సమయంలో ఒక మూడక్షరాల మంత్రం ఆయన ప్రయోగించారు. గతంలో వైఎస్‌ఆర్ అనే మూడక్షరాలు(ఇంగ్లీషులో) ప్రజలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చేవట.ఇప్పుడు కూడా అవే మూడక్షరాలు(కాకుంటే తెలుగులో) జగన్ వారికి భరోసాగా వున్నారన్నారు. జగన్‌పైన గోబెల్స్ తరహా దుష్ప్రచారం సాగుతున్నదని ఆరోపించిన బొత్స తమకు యువ నాయకత్వముందని పదేపదే చెప్పడం గమనించదగ్గది. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది వైఎస్ వారసత్వం జగన్ యువనాయకత్వంపై వైసీపీ ఎక్కువ ప్రచారం చేయనున్నది. విశాఖ జిల్లా పెందుర్తిలో దళితస్త్రీపైన కుటుంబంపైన టిడిపినేతల దౌర్జన్యాలను కూడా ఈ సందర్భంగా బొత్స, మరోవైపున రోజాతీవ్రంగా ఖండించారు.