పోలవరం ప్రాజెక్టు విషయమై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య కొంత సర్కస్ జరుగుతోంది! ఇన్నాళ్లూ టీడీపీకి సోమవారం పోలవారం. ఇకపై భాజపాకి నెలకోసారి పోలమాసం అనొచ్చేమో. ఇకపై పోలవరం పనులు భాజపా సమర్పణలో జరగబోతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు అదే వాాతావరణం కనిపిస్తోంది. గతంలో, ఈ ప్రాజెక్టు విషయమై ఢిల్లీ స్థాయిలో ఏదైనా ఒక సమావేశం జరిగిందంటే… సుజనా చౌదరి వంటి టీడీపీ నేతల చొరవ కనిపించేది. కానీ, తొలిసారిగా.. ఏపీకి చెందిన భాజపా నేతలతో, అదీ ఉప రాష్ట్రపతి సమక్షంలో పోలవరం ప్రాజెక్టు విషయమై సమావేశం జరగడం అనేది ప్రత్యేకంగా చూడాల్సిన అంశమే. సమావేశం అనంతరం ఏపీ భాజపా అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేశారు. డిజైన్లన్నీ ఖరారు అయ్యాయనీ, మరో నెలరోజుల్లో పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. ఇకపై నెలకోసారి కేంద్రమంత్రి నితిన్ గట్కరీ పోలవరం పనులు సమీక్షిస్తారని కూడా చెప్పారు. ప్రాజెక్టు నిధుల విషయమై కూడా అరుణ్ జైట్లీని కలిశామని చెప్పారు.
నిజానికి, పోలవరం విషయమై గట్కరీ కొత్తగా చెప్పిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్రాలు కలిసే ఈ ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. కాకపోతే, ఏపీ భాజపా నేతలు ప్రత్యేకంగా ఇదే పని మీద ఢిల్లీ వెళ్లడం, కేంద్రమంత్రిని కలుసుకోవడం ప్రత్యేకం! ఈ సమావేశాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. మొదటి.. ఆంధ్రప్రదేశ్ భాజపా నేతల కృషి. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప, రాష్ట్రం కోసం ఏపీ భాజపా నేతలు ప్రత్యేకంగా చేసిందేం లేదనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. పోలవరం విషయంలో కూడా ఇవే కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్లిపోయి.. పోలవరం ప్రాజెక్టుపై ఎనలేని బాధ్యత తమకే ఉందన్నట్టు చాటుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు.
ఇక, రెండోది… పోలవరం ప్రాజెక్టుపై భాజపా వైఖరి. పోలవరం పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటే అందుకు కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పడుతున్న అహోరాత్రుల శ్రమే అనే ఇమేజ్ ఉంది. ప్రతీ సోమవారాన్నీ ఆయన పోలవారంగా మార్చుకున్నారు. ప్రాజెక్ట్ విజిట్ లు, వర్చువల్ ఇన్ప్సెక్షన్లు అంటూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటారు. నిజానికి, పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా! కానీ, పోలవరంపై పొలిటికల్ మైలేజ్ టీడీపీకే ఎక్కువగా కనిపిస్తోంది. కనీసం ఇకనైనా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేలా జాగ్రత్తపడాలనే వ్యూహం భాజపా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. ఏపీలో కూడా భాజపాకి సోలోగా ఎదగాలనే లక్ష్యం ఉంది కదా. ఆ కోణం నుంచి కూడా ఈ భేటీని చూడొచ్చు. పైగా, ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఏ ఒక్కర్నీ పిలవకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. నిజానికి, పోలవరం ప్రాజెక్టు విషయమై ఈ స్థాయి సర్కస్ అవసరమా చెప్పండీ..!