యూపీఏ హయాంలో దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణం కేసులో పాటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డీఎంకేకి చెందిన ఎ రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏకవాక్య తీర్మానంలో కోర్టు తేల్చి చెప్పేయడం గమనార్హం. నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.
2 జి స్ప్రెక్టమ్… దేశాన్ని కుదిపేసిన కుంభకోణం. యూపీయే హయాంలో టెలీకమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా పనిచేసిన రాజాపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో పెద్ద కుంభకోణం జరిగిందంటూ ఫిర్యాదులు నమోదయ్యాయి. 2 జి అక్రమ కేటాయింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్టు కాగ్ నివేదికలో తేల్చి చెప్పింది. దీంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. ఇవే ఆరోపణలపై ఈడీ కూడా ఇంకో కేసు పెట్టింది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో డీఎంకే రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళితోపాటు… టెలీకమ్యూనికేషన్స్ మాజీ సెక్రటరీ సిద్ధార్థ్ బెహూరా, ఆర్కే సంతాలియాతోపాటు మొత్తంగా 14 మందిపై ఛార్జ్ షీట్ నమోదు అయింది. దాదాపు ఆరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విచారణకు వచ్చినప్పుడు… 2జీ స్పెక్ట్రమ్ కేసుపై తీర్పు ఈనెలకి వాయిదా పడింది. దీంతో ఇవాళ్ల తుది తీర్పును ఇచ్చింది కోర్టు. అందరూ నిర్దోషులు అని తీర్పు చెప్పింది.
ఈ తీర్పుతో డీఎంకే శ్రేణులు పూర్తి సంతోషంతో ఉన్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న రోజునే ఇలాంటి తీర్పు రావడం విశేషం. ఈ తీర్పు వల్ల వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లినా ఆ పైస్థాయి కోర్టు వెళ్లినా ఇదే తీర్పు వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ… ఇన్నాళ్తూ తమకు అండగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కబిల్ సిబల్ మాట్లాడుతూ… ఈ కేసు నేపథ్యంలో మాజీ ప్రధానిపై కూడా అప్పట్లో చాలా ఆరోపణలు చేశారన్నారు. 2జీ వ్యవహరంలో ఎలాంటి తప్పులూ జరగలేదని తాను అప్పట్నుంచీ చెబుతూనే ఉన్నానని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ కూడా స్పందిస్తూ… ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.