దేశంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా ఎపికి వర్తింపచేయడం, వైసీపీ టీడీపీలు రకరకాలుగా స్పందించడం పరిపాటిగా మారింది. దేశాన్ని కుదిపేసిన 2జి కేసులో నిందితులైన కనిమొళి,రాజా తదితరులను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపైనా ఇదే తంతు. ఈ తీర్పు వస్తుండగానే ఒక టిడిపి నాయకుడు సుప్రీం కోర్టు 2జి కేటాయింపులు రద్దు చేస్తే కింద కోర్టు ఇలాటి తీర్పు ఇవ్వడమేమిటని ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడుపై ఎపిహైకోర్టులోనే వేర్వేరు జడ్జిలు వేర్వేరుగా ఆదేశాలు తీర్పులు ఇచ్చిన సంగతి నేను గుర్తు చేశాను. ఇంతకూ ఏ కేసులోనైనా తప్పును నిర్ధారించడం వేరు, దానికి కారణమైన దోషులను నిర్ణయించడం వేరు. కాగ్ నివేదికలో 1,70వేల కోట్ల నష్టం వచ్చినట్టు నివేదిస్తే సిబిఐ చార్జిషీటులో 30 వేల కోట్ల నష్టం మాత్రమే చూపించారు. దానిపై విచారణలో మాజీ కేంద్ర మంత్రి రాజా స్వయంగా వాదించారు. తనొక్కడే గాక ప్రధాని మన్మోహన్‌తో సహా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చివరకు కోర్టు కేసు కొట్టి వేసింది. దీని ప్రభావం జగన్ కేసులపై ఎలా వుంటుందని నన్ను ఒక ఛానల్ వారు అడిగారు. ఈ రెండు కేసులలో చాలా తేడాలున్నా ఒక పోలిక వుంది. ప్రభుత్వం వల్ల అక్రమంగా లబ్దిపొందిన వారు అధినేతలకు సంబంధించిన వారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణ ఒక్కటే. 2జిలో వచ్చిన విపరీత లాభంతోనే కనిమొళి ఆధ్వర్యంలోని కళైంగార్ టీవీలో 200 కోట్లు పెట్టారనేది అక్కడ ఆరోపణైతే భూములు పొందిన వారు సాక్షిలో పెట్టారనేది ఇక్కడ అభియోగం. అక్కడ కనిమొళి లాగే ఇక్కడ జగన్ కూడా జైలులో వుండివచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నికల్లో భారీగా స్తానాలు పొందారు. కేసు విచారణ సాగుతూనే వుంది గాని నిర్ధారణలు జరిగింది లేదు. మధ్యలో ఇడి ఆస్తుల స్వాధీనాలు కూడా జరిగాయి. మరోవైపున ఐఎఎస్‌లు కొందరు విముక్తి పొందారు. ఇప్పుడు 2 జి తీర్పు వెలుగులో తమ నాయకుడు కూడా బయిటపడతారని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు. నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. కాని 2జి కేసు కొట్టివేత వైసీపీకి వూరటగా వున్నట్టు కనిపిస్తుంది. అప్పట్లో అవినీతిపై సమరం చేసిన అన్నా హజారే కూడా కోర్టు చెప్పాల్సిందే చెప్పిందని వ్యాఖ్యానించారు.ఇక మాజీ ప్రధాని మన్మోహన్ అయితే కేసులో అంతా అవాస్తవారోపణలు చేసినట్టు తేలిపోయిందన్నారు. అప్పటి సిఎజి వినోద్ రారు కావాలని చేశారని కేసు వాదించిన కపిల్ సిబాల్ చెప్పారు.ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ తీర్పును నిజాయితీకి కితాబులాగా చూడొద్దని చురక వేశారు. జాతీయ స్పందనలు ఎలా వున్నా వైసీపీ టీడీపీల మధ్య మాత్రం షరా మామూలుగా మాటల యుద్దం మొదలవుతున్నది.