‘సోగ్గాడే చిన్ని నాయనా’ రివ్యూ:
సరదా సరసాలతో సోగ్గాడే చిన్ని నాయనా
బ్యానర్ :అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,
లావణ్య త్రిపాఠి, నాజర్, సంపత్, నాగబాబు,
హంసానందిని, అనసూయ తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఆర్.సిద్ధార్థ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
మూలకథ: పి.రామ్మోహన్
నిర్మాత: అక్కినేని నాగార్జున
రచన, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ
విడుదల తేదీ: 15.01.2016
గతంలో అక్కినేని నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో, పంచెకట్టుతో కొన్ని సినిమాలు చేశాడు. అయితే అప్పటి కథలు వేరు, అప్పటి క్యారెక్టరైజేషన్స్ వేరు. ఆ తర్వాత నాగార్జున ఎక్కువ రొమాంటిక్ ఎంటర్టైనర్స్పైన, యాక్షన్ మూవీస్ పైన దృష్టి పెట్టడంతో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చెయ్యడానికి వీలు పడలేదు. చాలా గ్యాప్ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో అలాంటి క్యారెక్టర్ చేశాడు నాగార్జున. దర్శకనిర్మాత పి.రామ్మోహన్ మూల కథ ఆధారంగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ అచ్చమైన తెలుగు ఈ సంక్రాంతికి విడుదలైంది. మరి ఈ సినిమాలో సోగ్గాడిగా నాగార్జున ఎలాంటి వినోదాన్ని పంచాడు? విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో వున్న కొత్త పాయింట్ ఏమిటి? కొత్త డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేశాడు? ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
అది పశ్చిమ గోదావరి జిల్లాలోని శివపురం అనే గ్రామం. ఆ గ్రామంలో వున్న శివాలయాన్ని ఆ ఊరి జమీందార్ అయిన బంగార్రాజు(నాగార్జున) వంశానికి చెందిన పూర్వీకులు కట్టించారు. ఆ ఆలయంలో బంగారు ఆభరణాలు వున్న గదిని ఆ వంశానికి చెందిన వారు మాత్రమే తెరవగలరు. ఆ ఆభరణాల్ని కాజెయ్యాలని ప్రయత్నించినవారు అక్కడి పాము కాటుకు గురై మరణిస్తుంటారు. 30 సంవత్సరాల క్రితమే బంగార్రాజు చనిపోతాడు. ప్రజెంట్‌కి వస్తే యు.ఎస్. నుంచి బంగార్రాజు కొడుకు రాము(నాగార్జున), కోడలు సీత(లావణ్య త్రిపాఠి) ఇండియాకి వస్తారు. వాళ్ళిద్దరూ సడన్‌గా ఇండియా ఎందుకు వచ్చారో బంగార్రాజు భార్య సత్య(రమ్యకృష్ణ)కి అర్థం కాదు. డాక్టర్ అయిన రాము భార్య సీతని పట్టించుకోవడం లేదని, అందుకని ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుసుకుంటుంది సత్య. తన భర్త ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరుగుతుండడంతో తన కొడుకు అలా కాకూడదని అమ్మాయిలకు దూరంగా వుండాలని చిన్నతనంలోనే కొడుక్కి నూరిపోస్తుంది సత్య. దాన్నే ఫాలో అవుతూ పెళ్ళయిన తర్వాత భార్యని కూడా పట్టించుకోకపోవడంతో అది విడాకుల వరకు వస్తుంది. దీనంతటికీ ఆ బంగార్రాజే కారణమని సత్య తిడుతున్న టైమ్‌లో… అక్కడ యమలోకంలో ఆడ యమ భటులతో సరసాలాడుతూ వుంటాడు బంగార్రాజు. యమలోకంలోని ఆడవాళ్ళనందర్నీ తనవైపు తిప్పుకుంటున్న బంగ్రారాజుని వెంటనే భూలోకం పంపించేస్తాడు యమధర్మరాజు(నాగబాబు). అయితే అలా పంపడం వెనుక కారణం వుందని, ఒక సత్కార్యాన్ని నెరవేర్చేందుకే అతని భూలోకం పంపానని చిత్రగుప్తుడికి చెప్తాడు యమధర్మరాజు. అతని భార్యకి మాత్రమే కనపడేలా, అతని మాటలు కూడా భార్య మాత్రమే వినగలిగే వరాన్ని బంగార్రాజుకి ప్రసాదిస్తాడు యమధర్మరాజు. భూలోకం వచ్చి భార్యని కలుసుకున్న బంగ్రారాజుకి కొడుకు, కోడలు విషయం తెలుస్తుంది. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ విడాకులు సంగతి మర్చిపోయి కలిసి వుండేలా చెయ్యమని భర్తని కోరుతుంది సత్య. కొడుకుని, కోడల్ని కలపడానికి బంగార్రాజు ఏం చేశాడు? యమధర్మరాజు అతన్ని భూలోకానికి పంపడానికి కారణం ఏమిటి? బంగార్రాజు భూమ్మీద చేయాల్సిన సత్కార్యం ఏమిటి? అసలు అతనెలా చనిపోయాడు? అందరికీ మంచి చేసే బంగార్రాజుకి శత్రువులు ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఎప్పుడూ చలాకీగా వుంటూ, అమ్మాయిలతో సరసాలు ఆడుతూ వుండే బంగార్రాజుగా, అమాయకంగా వుంటూ, అమ్మాయిలతోనే కాదు భార్యతో కూడా డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేసే రాముగా నాగార్జున పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెంట్‌గా వుంది. రెండు క్యారెక్టర్స్‌లోని వేరియేషన్ని చాలా అద్భుతంగా చూపించాడు. బంగార్రాజు భార్యగా రమ్యకృష్ణ చాలా పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా వుంది. రాము భార్యగా లావణ్య త్రిపాఠి గ్లామర్‌గా కనిపించడమే కాదు పెర్ఫార్మెన్స్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. నాజర్, సంపత్, నాగబాబు, వెన్నెల కిశోర్, అనసూయ, హంసానందిని తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఆత్మలతో మాట్లాడే ఆత్మానందంగా బ్రహ్మానందం తన శక్తిమేర వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. అనుష్క స్పెషల్ అప్పియరెన్స్ ఆడియన్స్‌కి సర్ప్రైజ్లా అనిపిస్తుంది. ఒక సీన్‌తోపాటు నాగార్జునతో స్టెప్పులు కూడా వేసింది అనుష్క.
టెక్నికల్ డిపార్ట్మెంట్:
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్లుగా పి.ఎస్.వినోద్, సిద్ధార్థ పనిచేశారు. పల్లెటూరి అందాల్ని మరింత అందంగా చూపించారు. సినిమాలోని ఎక్కువ సీన్స్ గ్రీనరీతో వుండడం విశేషం. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్ కూడా కళ్ళకు ఇబ్బంది కలిగించేలా కాకుండా చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ పాటలు ఆడియోపరంగా ఆకట్టుకున్నాయి. పాటల పిక్చరైజేషన్ కూడా బాగుంది. సినిమాలోని సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు అనూప్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌లో, క్లైమాక్స్‌లో అదే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రణగొణ ధ్వనులతో సాగింది. డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ గురించి చెప్పుకోవాల్సి వస్తే రామ్మోహన్ అందించిన మూలకథని నాగార్జున ఇమేజ్‌కి తగ్గట్టుగా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సినిమాగా మలిచాడు. మాటలు అంతగా ఆకట్టుకోలేదు. ఆర్టిస్టుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా నాగార్జునతో పూర్తి కాంట్రాస్ట్‌గా వున్న రెండు క్యారెక్టర్లను అద్భుతంగా చేయించాడు.
విశ్లేషణ:
ఈ సినిమా కథపరంగా ఆలోచిస్తే అందులో కొత్తదనం ఏమీ లేదు. అలాగే కథనంలో కూడా కొత్తదనం కనిపించదు. కానీ, కొన్ని సీన్స్ మాత్రం కొత్తగా అనిపిస్తాయి. ఒక గుడిలోని బంగారు ఆభరణాలను కొట్టెయ్యడానికి బంగార్రాజు వంశానికే చెందిన వారు ప్రయత్నించడం, యమలోకం నుంచి వచ్చిన బంగార్రాజు దాన్ని అడ్డుకొని అతని ఫ్యామిలీని ప్రమాదం నుంచి రక్షించడం అనేది టోటల్ కథ. ఈ పాయింట్‌ని ఆడియన్స్‌ని రెండున్నర గంటలసేపు కూర్చోబెట్టి చెప్పాడు డైరెక్టర్. బంగార్రాజు కొడుకు, కోడలు అమెరికా నుంచి రావడం, అప్పడప్పుడు కొడుకులో ప్రవేశించే బంగార్రాజు కొంత ఎంటర్టైన్మెంట్, కొంత యాక్షన్ చెయ్యడం వంటి సీన్స్‌తో తర్వాత ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ లేకుండా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో కూడా ఓ అరగంట సినిమా నడిచిన తర్వాత బంగార్రాజు కుటుంబానికి ఎలాంటి ప్రమాదం పొంచి వుంది, ఆ ప్రమాదం నుంచి తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు అనేది క్లైమాక్స్. సినిమాలో బ్రహ్మానందం ఎపిసోడ్ తప్ప వేరే కమెడియన్స్‌కి అవకాశం ఇవ్వకుండా కామెడీని కూడా తన రెండు క్యారెక్టర్ల ద్వారానే అందించాడు నాగార్జున. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్త డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ చేసిన ఈ సినిమాలో ఆడియన్స్‌ని అబ్బుర పరిచే సీన్స్, థ్రిల్ చేసే ఎలిమెంట్స్‌గానీ లేకపోయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది ‘సోగ్గాడే చిన్ని నాయనా’.
తెలుగు360.కాం రేటింగ్ 3/5