అన్నపూర్ణ స్డూడియోస్ నుంచి ఓ సినిమా వస్తోంంటే, అందులోనూ అఖిల్, నాగచైతన్య సినిమా అంటే అందులో నాగార్జున జోక్యం తప్పని సరి. హలో విషయంలో అయితే ఈ జోక్యం మరీ ఎక్కువైందని, విక్రమ్ కె.కుమార్ కూడా నాగ్ తో పడలేకపోతున్నాడని సోషల్ మీడియాలో కథనాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తొలిసారి ఈ విషయంపై నాగ్ నోరు విప్పాడు. తను కూడా ఈ కథనాలు చదివానని, అయితే తన జోక్యం స్ర్కిప్టు ఫైనలైజ్ వరకే ఉంటుందని, సినిమా అంతా పూర్తయ్యాక మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్లో జోక్యం చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు నాగ్. ”ఎడిటింగ్కీ, డీఐకీ. స్పెషల్ ఎఫెక్ట్స్‌కి తగిన సమయం ఇవ్వాలన్నది నా తాపత్రయం. మంచి సినిమా తీయడం కాదు, పోస్ట్ ప్రొడక్షన్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్నది నా ఉద్దేశం. క్రియేటివ్ పరంగా నేనేం పెద్దగా జోక్యం చేసుకోను. ప్రొడక్షన్ లో రాజీ పడను” అన్నాడు నాగ్. బడ్జెట్ పెరిగిపోయిందన్న కామెంట్లకూ నాగ్ నుంచి సమాధానం వచ్చింది. ”కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చినప్పడు, వాళ్లతో భారీ సినిమాలు తీసేటప్పుడు ఎవ్వరూ బడ్జెట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకని అడుగుతున్నారు. నా కొడుకు కాబట్టే ఎక్కువగా ఖర్చు పెట్టా” అంటూ కుండ బద్దలు కొట్టేశాడు నాగ్.