కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు ఏపీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉండేవారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర ఏ అంశం ప్రస్థావించాలన్నా, ప్రయత్నించాలన్నా వయా వెంకయ్య నాయుడు ద్వారానే జరుగుతూ ఉండేవి. ఓరకంగా కేంద్రంలో సీఎం చంద్రబాబుకు కొండంత ధైర్యంగా ఆయన కనిపించేవారు అనడంలో అతిశయోక్తి ఉండదు! అయితే, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక.. రాజకీయ వ్యవహారాలకు కొంత దూరమయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి వ్యవహారాల్లో ఆయన చొరవ కాస్త తగ్గుతుందని టీడీపీ కూడా భావించింది. వెంకయ్య నాయుడు అందుబాటులో లేని లోటును వారు కొంత ఫీలయ్యారనే చెప్పాలి. అయితే, గడచిన రెండ్రోజులుగా ఏపీ వ్యవహారాలకు సంబంధించి వెంకయ్య చొరవ కొంతమేర పెరిగినట్టుగానే కనిపిస్తోంది.
వరుసగా రెండో రోజున కూడా ఉప రాష్ట్రపతి సమక్షంలో ఏపీకి సంబంధించిన కీలకమైన అంశమే చర్చ జరగడం గమనార్హం! కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన విషయమై ప్రముఖ టీడీపీ నేతలు ఉపరాష్ట్రపతిని కలిశారు. సీఎం రమేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు కొందరు నేతలు ఇదే విషయమై కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ దగ్గరకి వెళ్లారు. అయితే, వెంకయ్య నాయుడు చొరవ తీసుకుని, వీరందరినీ తన క్యాబిన్ కి పిలిపించుకున్నారు. దీంతో కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. నిజానికి, కడపలో ఈ కర్మాగారం ఏర్పాటు సాధ్యమా అనే అనిశ్చితి కొన్నాళ్లుగా నెలకొంది. ఈ సమావేశంతో కొంత సానుకూల సంకేతాలు వచ్చాయి.
ఇక, ఈ సమావేశానికి ముందు రోజున కూడా పోలవరం విషయం కూడా వెంకయ్య సమక్షంలోనే కీలక సమావేశం జరిగింది. ఇది కూడా ఓ రకంగా మంచి పరిణామంగానే చూడొచ్చు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్తే, సంబంధిత శాఖలవారిని తన చాంబర్ కే పిలిపించుకుని, ఇలా చర్చించి వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం వెంకయ్య చేస్తున్నారనే అనుకోవచ్చు. రాజకీయ వ్యవహారాలకు కొంత దూరమైనా, రాష్ట్ర సమస్యల విషయమై ఆయన చొరవ తీసుకుంటున్నట్టు సంకేతాలు ఇవ్వడం… టీడీపీ సర్కారుకు కొంత ఊరట లభించే అంశంగానూ చెప్పొచ్చు.