జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధినేత నుంచి అదిష్టానం నుంచి తమకు రావలసిన అండదండలు రావడం లేదని నగర తెలుగుదేశం నాయకులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేజేతులా దాన్ని టిఆర్ఎస్కు ధారదత్తం చేయడానికే తమ నాయకుడు సిద్ధమైనట్టు కనిపిస్తుందని వాపోతున్నారు. ఇది ఎన్నికల తర్వాత మొదటి దశలో తమకు చెప్పిన దానికి భిన్నంగా ఉందని బాధపడుతున్నారు. కెసిఆర్ ఏకపక్ష ధోరణులకు వ్యతిరేకంగా తాము గట్టిగా పోరాడటానికి ఇది ఆటంకమై పోయిందని,ఇప్పుడు గనక జిహెచ్‌ఎంసిలోనూ దెబ్బతింటే పరిస్థితి ఇంకా దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు. నిజాం కాలేజీ మైదానంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్పై నేరుగా విమర్శలు చేయలేకపోయారన్న వివరణ కూడా వారికి మింగుడు పడటంలేదు. అలాటప్పుడు కెసిఆర్‌పైన ఇతర టిఆర్ఎస్ నేతలపైన ఇష్టానుసారం నోరుపారేసుకునే రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. గత వారం రోజులలోనూ నాతో మాట్లాడిన కొందరు తెలుగుదేశం సీనియర్ నేతల మనోభావాలు ఇవి.
రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొదటిదశలో చంద్రబాబు పదేళ్లు ఇక్కడే ఉంటాననీ, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తానని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తను పాలించాల్సిన ఏపి కన్నా తెలంగాణ తమ్ముళ్లకే అధిక సమయం ఇచ్చి అవతలి వారికి అసంతృప్తికీ కారణమయ్యారు. హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న ఏర్పాటును ఆయన అతిగా అంచనా వేసుకున్నారని చెప్పాలి. ఒకసారి విభజన జరిగి హైదరాబాదు మరో రాష్ట్రానికి రాజధాని అయిన తర్వాత ఇక్కడ తమ రాజ్యాంగ స్థానానికి రక్షణ ఉండొచ్చు గాని రాజకీయాధికారం చెల్లుబాటయ్యే ప్రసక్తి ఉండదని ఆయన గ్రహించలేకపోయారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా తనకు ఒక ప్రత్యేక పట్టు ఉంటుందని అంచనా వేసుకున్నారు. విభజన చట్టంలోని నిబంధనల్లోనూ ఇరువైపుల నుంచి బోలెడు అస్పష్టతలున్నాయి. ఏది ఎలా ఉన్నా కేంద్రం గాని గవర్నర్ గాని తెలంగాణ ముఖ్యమంత్రిని చికాకుపరిచే ఏ చర్యలూ అనుమతించలేదు.
దాంతో పాటు కెసిఆర్ కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. ఫీజుల రీ ఇంబర్సుమెంటు, వాహనాల రిజిస్ట్రేషను, తెలంగాణ నివాసయోగ్యత వంటి అంశాల్లో ఆయన ప్రభుత్వ చర్యలు న్యాయస్థానంలో వీగిపోయాయి. హైదరాబాదులో భవనాల మార్పుపై చేసిన హడావుడి ప్రకటనలు అమలు చేసింది లేదు. ఆఖరుకు మెట్రో పొందిక మార్పుపై ఆదిలో తెల్పిన అభ్యంతరాలు కూడా ఆచరణలో నిలవకపోగా ఆర్థిక భారాన్నే పెంచాయి. ఈ కారణాలవల్ల గాని, పెద్ద విశ్వాసం లేకగాని కెసిఆర్ హైదరాబాదుపై ఏడాది కాలంలో చెప్పుకోదగిన చొరవలేమీ చూపించలేదు. బిజెపి టిడిపి పొత్తు కుదర్చుకున్నప్పుడు చాలా ప్రభావం వుంటుందనే అంతా భావించారు. అయితే తెలుగుదేశం స్వయం కృతంగా అపఖ్యాతికరమైన ‘ఓటుకు నోటు’ ఇదంతా మార్చేసింది! ఎందుకంటే ఓటుకు నోటుకు కేంద్ర స్థానం హైదరాబాదు.
మహాభారతంలో సర్పయాగంలో తక్షకుడికి రక్షణ నిచ్చినందుకు ఇంద్రుడి శిరస్సుకే చుట్టుకుంటుంది. అలాగే ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డిని కాపాడాలనుకుంటే చంద్రబాబు మెడకే చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సూత్రధారిగా లోకేష్ పేరు కూడా అనేక ఆధారాలతో ఉన్నట్టు వినిపించింది. ఆ పరిణామం తెలుగుదేశంను ఎంతగా కుదిపేసిందంటే ఆ రోజుల్లో ఆ పార్టీ తరపున మాట్లాడేందుకు టిటిడిపి నేతలెవరూ అందుబాటులో ఉండేవారు కాదు!
ఈ క్రమంలో ఎదురుదాడి కోసం తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు. ఇక్కడ తమకు భద్రతలేదని పైకి ఆరోపిస్తున్నా వాస్తవానికి సర్దుకోకతప్పదని నిర్ధారణకు వచ్చారు. పైగా అవతల ఏపిలో పాలనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు కూడా పెరిగాయి గనక ఇది అనివార్యమైంది. ఇక ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు సవాళ్లు విసురుకున్న స్థితి పోయి సఖ్యత ప్రదర్శించడం మొదలు పెట్టారు. సహజంగానే ఇది కెసిఆర్‌కు చంద్రబాబు తలవంచిన ఫలితమేననే విమర్శలూ పెరిగాయి. హైదరాబాదులో ఆట మొదలైంది అంటూ హల్చల్ చేయజూసినవారి దూకుడుకు అధినేత నుంచే ప్రతిస్పందన కరువైంది. కెసిఆర్ నేను దోస్తులుగా ఉంటాం…మీరు కుస్తీ పట్టండి అనేది ఆచరణలో బలహీనపరిచింది.
దీనికి తోడు టిటిడిపిలో నిర్ణయాత్మకంగా పనిచేసేందుకు ఏ ఒక్కరినో కీలక బాధ్యుడుగా ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు గజిబిజి సృష్టించారు. షరామామూలుగా తన చేతుల్లోనే పగ్గాలు అట్టిపెట్టుకున్నారు. అద్యక్షుడు, కార్యనిర్వాహక అద్యక్షుడు, శాసనసభా నాయకుడు అంటూ త్రిముఖ కేంద్రాలను ఏర్పాటు చేసి మరో వైపున లోకేష్ సారథ్యం, హైదరాబాదు పార్టీ అద్యక్షుడుగా మాగుంట గోపీనాథ్ నాయకత్వం మొత్తం పరస్పరం పొందిక పొంతన లేని తతంగమై పోయింది. హైదరాబాదులో బలమైన బిసి నేతలను పక్కన పెట్టారనే భావం ఏర్పడింది.
ఈ ప్రభావం బిజెపినీ ఇరకాటంలో పెట్టింది. అంతకు ముందు మోడీ మోత మేలు చేసి సీట్లు తెచ్చినా ఇప్పుడు బీహార్ తర్వాత ఆ ఆశ తగ్గింది. తెలుగుదేశం చుట్టూ తిరగడం వ్యర్థమనే భావన ఏర్పడింది. దీనికి తోడు ఆ పార్టీలో అంతర్గత కలహాలూ బహిర్గతమైనాయి.ఇలా ఎన్‌డిఎ కూటమికి శాసనసభ ఎన్నికల నాటి బలాధిక్య పరిస్థితి మటుమాయమైంది. బిజెపి ఎప్పుడూ మజ్లిస్‌నే దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేయడం టిడిపిలో కొందరికి నచ్చడం లేదు. అసహనం ఆరోపణల నేపథ్యంలో మైనార్టీల ఓట్లు మరింతగా కోల్పోవడానికి ఇది కారణమవుతుందనే భయం వారికి వుంది.
అయితే ఇప్పటికీ కొన్ని కేంద్రాలలో తమకు గట్టి ఆధిక్యత వచ్చేదనీ నాయకుడి నిరాసక్తత నిరాదరణ తమను నిస్సహాయతలోకి నెడుతున్నాయని తెలుగుదేశం నగర రాష్ట్ర నాయకులలో అనేకులు ఆవేదనలో పడిపోయారు. ఈ ఎన్నికల్లో పరువు దక్కించుకోకపోతే, టిఆర్ఎస్ తమను మరింతగా వేటాడుతుందనే విషయం కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదంటున్నారు. మరి వీటన్నిటినీ అధిగమించి సీట్లసర్దుబాటు ముగించి అంతిమంగా గట్టి పోరాటం ఎలా ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధమవుతుందా అనేది ముందు ముందు చూడాలి.
ఇలాటి సమస్యలే ఇతర పార్టీలకూ వున్నాయి.