దేశంలో అతిపెద్ద కుంభకోణం అనుకున్న 2జీ కేసు పాత టపాసులా తుస్ మనేసింది! యూపీయే ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు తెచ్చిన ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలిచిన కేసులో అందరూ నిర్దోషులే అని కోర్టు తేల్చడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ తీర్పుపై పైకోర్టుకు సీబీఐ, ఈడీలు వెళ్తాయా.. అక్కడ అనూహ్యమైన మార్పులు ఉంటాయా అనేది కాసేపు పక్కనపెడితే… దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరారోపణలపై సరైన సాక్షాధారాలను కోర్టు ముందు పెట్టలేకపోవడాన్ని ఎవరి చేతగాని తనంగా చూడాలి..? ఆ కేసులో ఏమీ లేనప్పుడు.. ఏదో ఉందంటూ ఆరేళ్లపాటు ఎందుకీ సాగదీత..? మధ్యలో కొన్ని ప్రైవేటు కంపెనీల లైసెన్సులు రద్దయ్యాయి. వాటి పరిస్థితేంటీ..? 2జీ లాంటి లక్షల కోట్ల అవినీతి ఆరోపణల కేసు విషయంలోనే ఇలా జరిగితే.. రేప్పొద్దున మరో ఆర్థిక నేరం కేసులో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందా..? ఇలా చాలా అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ తీర్పు ఉంది. ఇదే సమయంలో.. రాజకీయ కోణంపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఈ కేసుపై తీర్పు విడుదలయ్యాక కాంగ్రెస్, డీఎంకేలు సంబరాలు చేసుకున్నారు. ఎవరికివారు తమ నిర్దోషిత్వం నిరూపణ అయిందంటూ చాటుకుంటున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏదో అవినీతి జరిగిపోయిందంటూ మమ్మల్ని ఆడిపోసుకున్నారనీ, ఆఖరిని మౌనముని లాంటి మన్మోహన్ సింగ్ ను కూడా ఇందులోకి లాగారనీ, నిజం నిగ్గు తేలిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో నైతిక విజయం తమదే అంటున్న కాంగ్రెస్ కు, ఈ తీర్పు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామమే. దీనికి ఓ సెంటిమెంట్ కోణం తోడైందండోయ్…! పార్టీ అధ్యక్షుడి రాహుల్ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ కి వరుసగా సానుకూల అంశాలు ఎదురౌతున్నాయట..!
ఈ తీర్పు నేపథ్యంలో భాజపాలో కాస్త పరిణిత స్థాయి స్పందన కనిపిస్తోంది. నిందితులు అందరి మీదా హైకోర్టులో ప్రభుత్వమే అప్పీల్ చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. జయలలిత కేసులో కూడా ఇలానే జరిగిందనీ, కర్ణాటక కోర్టు కొట్టేస్తే.. ఆ తీర్పును సుప్రీం కోర్టు ఈ ఏడాదే కొట్టేసిన సంగతి మరచిపోకూడదన్నారు. అదేంటీ… సరిగ్గా ఈ తీర్పు వెలువడే కొద్దిరోజులు ముందే కరుణానిధితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు కదా అంటే… ప్రతీదానికీ పెడార్థాలు తీయకూడదంటూ కొందరు కమలనాథులు చెబుతున్నారు. కోర్టు తీర్పుకీ, మోడీ పర్యటనకీ సంబంధం లేకపోవచ్చుగానీ… డీఎంకే విషయంలో ఈ మధ్యకాలంలో కమలనాధుల వైఖరి కొంత సానుకూలంగానే మారుతోంది! చాలా సింపుల్ లాజిక్… వచ్చే ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎంపీల మద్దతు అవసరం పడొచ్చు. అన్నాడీఎంకే శ్రేణుల్ని నమ్ముకుంటే తమిళనాడులో భాజపాకి ఒరిగేదేం ఉండదని స్పష్టమౌతోంది. అలాగని, డీఎంకే ఎప్పట్నుంచో కాంగ్రెస్ అనుయాయి! ఇప్పుడు కూడా డీఎంకే ని కాంగ్రెస్ వదులుకోదు. అయితే, కరుణానిధితో మోడీ భేటీకి.. డీఎంకేతో భాజపా పొత్తుకి ఇప్పుడు చాలామంది లింక్ పెడుతున్నారు. మీడియాలో కూడా చాలా విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. కానీ, తమిళులలో భాజపాపై సానుకూల దృక్పథం లేదు. ఇంకా చెప్పాలంటే కొంత వ్యతిరేక భావన ఎక్కువ ఉంది. కాబట్టి, ప్రజల మనోభావాలను విరుద్ధం డీఎంకే వ్యవహరించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదేమైనా, 2 జీ స్కామ్ పై వెలువడిన తీర్పు, రాజకీయ సమీకరణల్లో కూడా కొన్ని మార్పులకు నాందిగానే కనిపిస్తోంది.