Akhil Hello Review
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
ఓ సింపుల్ కథని కాంప్లికేటెట్గా చూపించడం
కాంప్లికేటెడ్ కథని సింపుల్ గా తీయడం
విక్రమ్ కె.కుమార్‌కి భలే వచ్చేశాయ్.
మనం చూడండి.. మూడు తరాల కథ. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకు పెడతాడో?
13 బి కథగా చెప్పమంటే తడబడి పోతాం. 24 కూడా అంతే.
ఇష్క్ సింపుల్ కథ. దాన్ని అటూ ఇటూ తిప్పి కొత్తగా చేసేశాడు
ఇప్పుడు హలో కూడా అంతే. కథగా చెప్పాలంటే తూనీగ తూనీగ అంటూ పాడుకున్న – మనసంతా నువ్వే టైపు కథ.
దాన్ని అలాగే తీస్తే విక్రమ్ కె.కుమార్ మ్యాజిక్ ఏముంటుంది?
అందుకే వంద నోటు, ఫోన్ నెంబర్ మిస్, సెల్ ఫోన్ చోరీ – ఇలా అన్ని యాంగిల్స్ కలుపుతూ… కొత్తగా తయారు చేసే ప్రయత్నం చేశాడు. అదెలా సాగిందంటే..
కథ
శ్రీను (అఖిల్) ఓ అనాధ. పదేళ్ల వయసులో రోడ్డు మీద వయెలిన్ వాయిస్తూ.. బతికేస్తుంటాడు. అక్కడే జున్ను (కల్యాణి ప్రియదర్శిని) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. అయితే జున్ను ఇంట్లో వాళ్లు సడన్‌గా ఢిల్లీ వెళ్లిపోతారు. అక్కడ శ్రీనుకి, జున్నుకి కనెక్షన్ కట్ అవుతుంది. ప్రతీరోజూ.. అదే ప్లేస్‌లో జున్ను కోసం ఎదురు చూస్తుంటాడు శ్రీను. పదిహేనేళ్ల తరవాత శ్రీను – జున్ను ఎలా కలిశారు? వీళ్లిద్దరినీ విధి ఎలా కలిపింది?? అనేది తెరపై చూడాలి
విశ్లేషణ
విక్రమ్ ఇంత సింపుల్ కథని ఎలా రాసుకోగలిగా?
నాగార్జున ఈ పాత చింతకాయ్ పచ్చడి కాన్సెప్ట్‌ని ఎలా ఒప్పుకున్నాడు?
ఈ సినిమాపై 40 కోట్లు ఎలా ఖర్చు పెట్టగలిగారు?
హలో కథ చెబుతున్నప్పుడు ఇలాంటి డౌట్లే వస్తుంటాయి. కాకపోతే… ఎవ్వరూ మర్చిపోకూడని విషయం ఒకటుంది… అది విక్రమ్ మ్యాజిక్. సినిమా మొదలైన కాసేపటికే ఓ సాదాసీదా కథకు విక్రమ్ మ్యాజిక్ తోడవుతుందని అర్థమవుతుంది. చిన్నప్పటి స్నేహితురాలి గురించి పదిహేనేళ్ల తరవాత ఓ క్లూ దొరుకుతుంది. అది ఫోన్ లో ఉంటుంది. ఆ ఫోన్ కాస్త చోరీ అయిపోతుంది. ఆ ఫోన్ కోసం హీరో పడే తాపత్రయంతో సగం కథ నడిచిపోతుంది.
ద్వితీయార్థంలో తన చెలి ఎదురుగానే ఉంటుంది. కానీ కనిపెట్టలేకపోతాడు. ఆ దాగుడుమూతలతో రెండో సగం గడిచిపోతుంది. ఈ మధ్యలో ఎమోషన్స్, లవ్, ఫీల్. థ్రిల్ ఇవన్నీ మేళవిస్తూ సినిమాని నడిపేశాడు.
చిన్నప్పటి ఎపిసోడ్ లెంగ్తీగా ఉన్నా క్యూట్‌గా అనిపిస్తుంది. ఆ వయసులో ఇద్దరి మధ్య ఆకర్షణలాంటి ప్రేమో. ప్రేమ లాంటి ఆకర్షణో చూపించడం కాస్త ఇబ్బందిగా ఉన్నా – ఆ పిల్లలు చూడముచ్చటగా ఉండడం వల్ల.. మనసుకి హాయిగా అనిపిస్తుంది. రమ్యకృష్ణ – జగపతిబాబుల మధ్య నడిపిన ఎమోషన్స్ కూడా హత్తుకొనేవే. ఫోన్ కోసం… అఖిల్ చేసే ఛేజింగులు థ్రిల్ ఇస్తాయి. అరె… సినిమా ఇప్పుడే కదా మొదలైంది అనుకొనేంతలో ఇంట్రవెల్ కార్డు వేశాడు.
కాకపోతే ఇక్కడే కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయి. ఫోన్ పోతే ఇన్ని ఛేజింగులు, ఇంత ఫైటింగులు అవసరం లేదు. కొత్త సిమ్ తీసుకోవొచ్చు. కాల్ డేటా ఇంకా ఈజీగా సంపాదించొచ్చు.
చిన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన జున్ను… ఒక్కసారి కూడా హైదరాబాద్ మళ్లీ ఎందుకు రాలేదు??
చిన్నప్పుడు ఒక్కసారి వచ్చినా.. శ్రీను కనిపించేవాడు కదా?
అదేదో ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియా టైపులో ఫోన్ దొంగల ముఠాని చూపించారు. వాళ్ల చేతిలో తుపాకులు… ఫైరింగులు, ఛేజింగులూ. ఇవన్నీ పాత ఫోన్ల కోసమేనా అనిపిస్తుంది. విలన్ని తొలిసారి జోకర్‌గా చూపించాడు విక్రమ్ కె.కుమార్.
నవతరం దర్శకుల్లో విక్రమ్ ని ప్రతిభావంతుడిగా, మిస్టర్ పర్ఫెక్ట్ గా అభివర్ణించొచ్చు. ఆయన సినిమాలు అలా ఉంటాయి. కానీ అలాంటి దర్శకుడే చిన్న చిన్న లాజిక్కుల దగ్గర దొరికిపోవడం ఏమిటో అర్థం కాదు.
ప్రధమార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థం సాగినట్టు అనిపిస్తుంది. డల్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే.. అక్కడక్కడ విక్రమ్ మ్యాజిక్ వర్కవుట్ అవుతూ ఉంటుంది. టెక్నికల్ టీమ్ సపోర్ట్‌తో ఈ సినిమా గట్టెక్కేస్తుంది.
నటీనటులు
అఖిల్ ని విక్రమ్ బాగానే వాడుకున్నాడు. తన నటన మెరుగు పర్చాడు. డాన్సులు క్యూట్‌గా ఉన్నాయి. సినిమా అంతా అఖిల్ పరిగెడుతూనే ఉన్నాడు. ఈసినిమా కోసం తానెంత కష్టపడ్డాడో, కసిగా చేశాడో అర్థమవుతూనే ఉంది. కల్యాణ్ ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫేస్ కాదు. చూడగా చూడగా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్‌లో ఆమె నుంచి ఒక్క డైలాగ్ కూడా వినిపించదు. ఎమోషన్ సీన్స్ లో కాస్త ఇబ్బంది పడింది. రమ్య – జగ్గూభాయ్ జంట అదిరిపోయింది. వాళ్ల మధ్య సీన్లు చాలా బాగా వచ్చాయి. వాళ్లు కూడా తమ అనుభవాన్నంతా రంగరించారు.
సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఒక్క మైనస్ కూడా ఈ సినిమాలో కనిపించవు. ఫైట్లు, ఆర్.ఆర్. పాటలు, కెమెరా అన్నీ హై క్లాస్‌లోనే ఉంటాయి. స్క్రిప్టు విషయంలో రాజీ పడని విక్రమ్ తొలిసారి… కాస్త మెత్తపడినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన తన మ్యాజిక్ సెకండాఫ్ వచ్చేసరికి మాయమైంది.
తీర్పు
తెలిసిన కథని, తన మ్యాజిక్ జోడించి చెప్పాలనుకున్నాడు విక్రమ్ కె.కుమార్. ఈ విషయంలో సగం మాత్రమే విజయవంతమయ్యాడు. ఓ క్యూట్ లవ్ స్టోరీకి టెక్నికల్ బ్రిలియన్స్ మేళవించాలన్నది నాగ్ ప్రయత్నం. లవ్ స్టోరీ వరకూ.. అది సఫలీకృతం అవ్వలేదు గానీ , టెక్నికల్ గా మంచి టీమ్‌ని ఎంచుకోవడంలోనూ, వాళ్లనుంచి తనకు కావల్సిన అవుట్ పుట్ రాబట్టుకోవడంలోనూ నాగ్ విజవంతమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, హలో.. అఖిల్‌లా నిరాశ పరచదు. మనంలా.. ఆశ్చర్యపరచదు.
ఫైనల్ టచ్ : హలో.. కొన్ని నెంబర్లు మిస్ అయ్యాయి
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5