హైదరాబాదులో కార్తీక్ అనే నేరోన్మాది పనిచేసుకు బతుకుతున్న సంధ్యారాణి అనే అమ్మాయిని అతి దారుణంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. నగరం నడిబొడ్డున జనసమ్మర్దం మధ్యనే ఇది జరిగింది. యాసిడ్ దాడుల వంటివాటి గురించి చాలాసార్లు చూస్తున్న సమాజానికి కూడా ఇది దిగ్బ్రాంతి కరంగా మారింది. ఆమె ఆస్పత్రిలో మరణంతో పెనుగులాడి చనిపోయింది.కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఇలాటి తరుణంలో కొన్ని ఛానళ్ల విలేకరులు వెళ్లి ఆమె గత జీవితం గురించి నేరస్తుడికి ఆమెతో వున్న ప్రేమ గురించి ప్రశ్నలు వేయడం ఏం వృత్తి ప్రమాణం?ఏ మానవీయం? అవన్నీ మాట్లాడించే సమయమా ఇది? ఆమె అతన్ని ప్రేమించింది అనుకున్నా మారకూడదా? మరొకరితో మాట్లాడకూడదా? ముందు జరిగిన అమానుషంపైనా సమాజం నేర్చుకోవలసిన విషయాలపైన దృష్టిపెట్టకుండా పెద్ద పరిశోధనాత్మక జర్నలిజం ఇదేనన్నట్టు వారికి ప్రేమానుబంధం వుందా లేదా అని అదేపనిగా మాట్లాడ్డం దారుణమైన విషయం. వాటిపై తర్వాత వివరంగా చర్చించవచ్చు. ఇలాటి ఘోరాలు ఆపడంపై అందరినీ అప్రమత్తం చేయడం, శోకసముద్రంలోని కుటుంబాన్ని ఓదార్చడం తక్షణం జరగాల్సినవి. దురదృష్టవశాత్తూ పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఇలాటి ఘటనలను క్రైం కింద కట్టేసి కొత్తకొత్త విలేకరులను అందులోనూ అమ్మాయిలను పంపించడం బాధాకరం. వారు మాట్లాడే తీరు విషాదంలో వికృతంలా వుంటున్నది.ఇక పోలీసు అధికారులు కూడా ఇదేదో చెదురుమదురు ఘటన అనీ, మహిళల అభద్రతకు సంబంధించిన సమస్యగా చూడొద్దని చెప్పడం మరింత విపరీతం.తమ శాఖ బాధ్యత లేదని తప్పించుకోవడానికి సమర్థించుకోవడానికి ప్రయత్నించవచ్చు గాని అసలు మహిళల సామాజిక సమస్య కాదన్నట్టు మాట్టాడితే ఎలా? రాజకీయ సైద్ధాంతిక తేడాలతో నిమిత్తం లేకుండా అందరూ ఒక తాటిపైకి ఇచ్చి ఇలాటివాటిని నివారించడానికి ఏదైనా కార్యాచరణ ఆలోచించాలి. రోడ్లపై దౌర్జన్యానికి వివాదాలకు గురవుతున్న అమ్మాయిల విషయంలో జోక్యం చేసుకునేలా శిక్షణ నివ్వాలి.