నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా… అంటున్నారు వైసీపీ ఎంపీలు. వీరికి ఆ విద్య నేర్పింది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ మాట బాగా వినపడేది. తెలంగాణ కోసం రాజీనామాల పర్వం అనే ఒరవడికి శ్రీకారం చుట్టారు టిఆర్ఎస్ అధినేత కేసీయార్. ఓ రకంగా చెప్పాలంటే ఆయన తరచుగా దాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకుని తెలంగాణ ఉద్యమాన్ని విజయపు తీరాలకు చేర్చారు. అప్పట్లో… తెలంగాణ అంశం మీద పదే పదే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయండంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూండేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఒకటే మాట చెప్పేవారు. అదేమంటే..‘‘తెలంగాణ ఇస్తామని చెప్పమనండి. ఇప్పుడే రాజీనామా చేసేస్తాం’’ అంటూ. ఇప్పుడు అచ్చం అదే మాటల్ని అప్పజెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎంపీలు.
తాజాగా శుక్రవారం ఢిల్లీ వెళ్లారు వైసీపీ ఎంపీలు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. పోలవరం, దుగ్గరాజపురం పోర్టు, డిసిఐ ప్రైవేటీకరణ… వగైరా అంశాల మీద చర్చించామని ఈ సందర్భంగా తమను కలిసిన విలేకరులకు చెప్పారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, వచ్చే 2018 చివరికల్లా పోలవరం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని అన్నారని వివరించారు. అదే సమయంలో ప్రత్యేకహోదా గురించిన ప్రస్తావన తెస్తే… ఈ విషయంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. గతంలో ఈ అంశంపై రాజీనామా చేస్తామని ప్రకటించారు కదా అని గుర్తు చేస్తే… రాజీనామా చేయడానికి ఇప్పటికైనా సిద్ధమేనని, అయితే హోదా ఇస్తారనే గ్యారంటీ ఉంటే తప్పకుండా చేస్తామన్నారు. తాము రిజైన్ చేస్తే ్రçపత్యేక హోదా గురించి కేంద్రం దగ్గర ప్రస్తావించే నాధుడే ఉండడన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు బాగా ఖరీదుగా మారిపోయాయని, దీనికి కారణం చంద్రబాబే నన్నారు. ప్రస్తుతం సామాన్యులు రాజకీయాల్లో నిలబడి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఇక్కడ వైసీపీ నేతల్ని ఓ రకంగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసింది రాజీనామా అంశం అనడం నిర్వివాడం. హోదా ఇవ్వకపోతే గత జూన్‌లోనే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత స్వయంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనికి ప్రధాని మోడీతో కుదరిన సయోథ్యే కారణంగా పుకార్లు ఉన్నాయి. అదలా ఉంచితే… దీనిపై సమాధానం చెప్పే క్రమంలో హోదా ఇస్తే తక్షణం రాజీనామాకు సిద్ధమని వైసీపీ ఎంపీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అసలు హోదా ఇస్తామని చెబితే… ఇక రాజీనామా చేయమని ఎవరంటారు? ఆ అవసరం ఏమొస్తుంది? తాము రిజైన్ చేస్తే హోదా గురించి అడిగే నాధుడు ఉండడు అనేది కొంత వరకూ వినడానికి బానే ఉన్నా… అది కూడా పూర్తి సహేతుకంగా లేదు. అరడజను మంది ఎంపీలు ఒక అంశం మీద రాజీనామా చేసి అదే అంశం మీద ఎన్నికలకు వెళితే అంతకు మించిన పోరాటం ఏముంటుంది? ఏదేమైనా… ప్రస్తుతానికి హోదా విషయంలో ఢిల్లీతో కన్నా గల్లీ పోరాటాల మీదే వైసీపీ ఎక్కువ దృష్టి పెట్టిందనేది రాజకీయ విశ్లేషకుల మాట.