పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చాలా అనుమానాలు ఉన్నాయంటూ వైకాపా నేతలు ఈ మధ్య తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై వైకాపా ఎంపీలు కూడా ఇవాళ్ల ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గట్కరీని కలిశారు. వారికి ఉన్న కొన్ని అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. నిజానికి, వైకాపా నేతలు ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి వచ్చారు, మరో ఏడాదిలో పని పూర్తి చేస్తామని కేంద్రమంత్రి చెబుతున్నా ఇంకా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు! పోలవరం అంశమై ఇన్ని చేస్తున్నారుగానీ… రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేస్తున్న ఆరోపణలపై మాత్రం వైకాపా నుంచి ఇంతవరకూ సరైన స్పందన రాలేదు. ఆయన విజయవాడలో మరోసారి అదే అంశాన్ని గుర్తుచేశారు. తాను అడుగుతున్న వివరాలపై వైకాపా నుంచి స్పందన వస్తుందేమో అని ఎదురుచూస్తున్నానని దేవినేని అన్నారు!
పోలవరం ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలు ఆలస్యమైందనీ, 2009లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ పావురాలగుట్టపైన కనిపించని రోజున… కేవీపీ, జగన్ లు కలసి పోలవరం స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 960 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులను కొట్టేయాలని ప్రయత్నించారన్నారు. దానికి సంబంధించిన టెండర్ ను ఉదయం 11 గంటలకు అప్ లోడ్ అయిందన్నారు. ఇది నిజమా కాదా అనేది ఇంతవరకూ జగన్ నుంచి తనకు సమాధానం రాలేదని దేవినేని చెప్పారు. జలవనరుల శాఖ మంత్రిగా తాను ప్రశ్నిస్తున్నాను అన్నారు. దాని వల్లనే ఢిల్లీకీ గల్లీకీ బేరం కుదర్లేదనీ, ఆరోజు రద్దు అయిన టెండర్లు 2013 మార్చిలో మళ్లీ ఒప్పందాలయ్యాయి అన్నారు. ఆనాడు పోలవరం కాంట్రాక్ట్ పనులు జగన్ కు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. ఇప్పుడు ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభ, లోక్ సభలో పక్క రాష్ట్రాల వారికి సమాచారాలు ఇస్తూ, ప్రశ్నలు వేయిస్తూ పనులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ దేవినేని ఆరోపించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం కూడా సంసిద్ధంగా ఉందన్నారు.
వైయస్సార్ హెలీకాప్టర్ కనిపించకుండా పోయిన రోజే టెండర్లు అప్ లోడ్ చేశారంటూ కొద్దిరోజుల కిందటే దేవినేని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని ప్రస్థావించారు. కానీ, వైకాపా నుంచి ఇంతవరకూ ఎవ్వరూ దీనిపై స్పందించకపోవడం విశేషం! దేవినేని ఆరోపిస్తున్నవి నిజామా కాదా అనే స్పష్టత కూడా ఇచ్చే ప్రయత్నం వైకాపా నుంచి ఇంతవరకూ రాలేదు. మరి, దేవినేని చేస్తున్న ఆరోపణ ఆ పార్టీ నేతలకు చేరలేదా..? రోజాకిగానీ, అంబటి రాంబాబుకిగానీ దీనిపై స్పందించేంత తీరిక లేదా..? మంత్రి చేస్తున్న ఆరోపణలకు మద్దతు ఇవ్వడం ఇక్కడ ఉద్దేశం కాదుకానీ, జగన్ పై ఆరోపణలు వినిపిస్తే వెంటనే స్పందించే వైకాపా నేతల రొటీన్ తీరుకు భిన్నమైన స్పందన వారిలో కనిపించడమే ఇక్కడ గమనించాల్సింది.