గుజరాత్ ఫలితాల తరువాత భాజపాలో విజయోత్సాహం ఉన్నప్పటికీ… కొంత జాగ్రత్త, ముందుచూపు అనేవి అడుగడుగునా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉన్నాయి. గుజరాత్ లో నైతికంగా గెలిచింది తామే అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నా, వాటిపై చర్చకు ఆస్కారం ఇవ్వకుండా మోడీ బాగానే జాగ్రత్తపడ్డారు. అంతేకాదు, భాజపా పట్ల కొంత వ్యతిరేకత పెరుగుతోందని విశ్లేషణలు రావడం, వాటిపై అధ్యయనం చేయాలంటూ మోడీ ఆదేశించడం చూశాం. ఇప్పుడు గుజరాత్ లో కొత్త ప్రభుత్వ కూర్పు విషయంలో కూడా జాగ్రత్తపడ్డారనే చెప్పొచ్చు. విమర్శించేందుకు ఎవ్వరికీ ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా.. మరోసారి విజయ్ రూపానీకి అవకాశం ఇవ్వడం విశేషం.
ఇంతకీ.. విజయ్ రూపానీనే మరోసారి కొనసాగించడం వెనక రెండు కారణాలను ప్రధానంగా చెప్పకోవచ్చు. మొదటిది.. విజయ్ రూపానీ వ్యవహార శైలి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాట జవదాటని అనుచరుడిగా ఆయనకు పేరుంది. అంతేకాదు, ఆయన జైన మతస్థుడు. తనకంటూ సొంత గ్రూపులూ సంస్థలూ వర్గాలూ వంటి కార్యకలాపాలు ఏవీ లేవు. పైగా, మంచి ఫండ్ రైజర్ గా ఆయనకి గుర్తింపు ఉంది. సో.. ఒక జాతీయ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా కొనసాగించేందుకు ఈమాత్రం అర్హతలు చాలు కదా. అమిత్ షా అభయం ఉన్నాక పదవికి ఢోకా ఏముంటుంది చెప్పండీ.
ఇక, ఆయన్నే కొనసాగించడానికి ఉన్న రెండో కారణం.. ఇతరులకు విమర్శించే ఆస్కారం ఇవ్వకుండా చేయడం. ఒకవేళ రూపానీని కాదని వేరే వారికి అవకాశం ఇస్తే… ఓరకంగా గుజరాత్ లో తగ్గిన భాజపా మెజారిటీకి కారణాన్ని చెప్పకనే ఒప్పుకున్నట్టు అవుతుంది కదా! విజయ్ రూపానీ పాలన బాగులేదు కాబట్టే భాజపాకి ఎదురీత తప్పలేదనీ, అందుకే ఆయన్ని మార్చేశారనే విమర్శలు వినిపించే అవకాశం ఉంటుంది. పైగా, ఆనందీ బెన్ తరువాత రూపానీని సీఎం చేయాలనే నిర్ణయం మోడీ, అమిత్ షా ద్వయానిదే కదా. ఆయన్ని కాదని వేరేవారికి అవకాశం ఇస్తే… మోడీ, అమిత్ షా నిర్ణయం తప్పు అనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి, గుజరాత్ విషయంలో తాము చేసింది ముమ్మూర్తులా కరెక్ట్ అని చెప్పుకోవడం తాజా నిర్ణయంతో ఆస్కారం ఉంటుంది. సో.. విజయ్ రూపానీ పేరును మరోసారి లెజిస్లేటివ్ పార్టీ నేతగా ప్రకటించడం వెనక ఈ కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.