రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శత్రువులూ ఉండరంటారు. ప్రయోజనాలే ఉంటాయి. కులానికి పర్యాయపదంగా వాడుతున్న సామాజిక తరగతుల విషయయంలోనూ ఇది జరుగుతుంటుంది. అలాటి కొత్త పరిణామాలే తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయా? ఇటీవల నేను రెండు రాష్ట్రాల్లోనూ చాలా జిల్లాల్లో సభలు కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడు ఆయా చోట్ల విన్నవి అలాగే వున్నాయి. ఇక మామూలుగా టీవీ ఛానెళ్ల చర్చలలో తెరపై హోరాహోరీగా వాదించుకున్న, కొన్నిసార్లు దూషించుకున్న నాయకులు కూడా బ్రేకు రాగానే ఆనందంగా ఆంతరంగికంగా మాట్లాడుకోవడం నిత్యకృత్యం. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య అభిమానులు కీచులాడుకుంటున్న కాలంలో వారిద్దరూ సిగరెట్ వెలిగించుకున్న దృశ్యం గుర్తుకు వస్తుంటుంది. అలాటి పరిణామమే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో జరుగుతుందా?
అందులో ఒకటి జిహెచ్ఎంసి ఎన్నికలపై చంద్రబాబు అనాసక్తి తెలుగు360 కోసం ప్రత్యేక కథనంగా ఉంది. దీనికి మరో కోణం ఏమంటే ఏపి, తెలంగాణ పాలక కుటుంబాల సామాజిక వర్గాలు ఒకటవుతున్నాయన్న కథనం.. తెలంగాణలో ఎలాగూ ఈ రెండూ ప్రధాన శక్తి కావు,ఇతరులను కలుపుకోవలసిందే. కాంగ్రెస్ సంప్రదాయకంగా మరో వర్గంపై ఆధారపడి వుంది. తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఈ వర్గం గురించి అనేక ఆశలు పెట్టుకున్నా కాంగ్రెస్ నుంచి గాని మోతుబరుల నుంచి ఇప్పుడు ఆయనకు మద్దతు లభించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో రెండు పాలక కులాలు చేయి కలిపితే తెలంగాణలో ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయని నిర్ధారణకు వచ్చి ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిపినట్టు చెబుతున్నారు. మీడియా సీనియర్ ఒకరు దీనికి సంబంధించి చాలా పేర్లు చెప్పగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు మీరు వెళ్లలేదా? అని అడగడం కొసమెరుపు.
ఇక ఆ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి చెప్పింది మరింత ఆసక్తిగా వుంది. ఎన్నికలకు ముందు తనతో సహా అయిదుగురు కాంగ్రెస్ ఎంపిలతో కెసిఆర్ సమావేశం జరిపారట. ఆయన ముందే తామంతా ఆ పార్టీలోకి వెళ్లాలా వద్దా ఎవరికి ఎంత లాభం అని చర్చించుకుని చివరకు ఇద్దరు ముగ్గురు వెళ్లాలని తనకు అంత ఉపయోగం లేదని భావించారట. అలా వెళ్లిన వారిలో ఒకరు మళ్లీ బయటకు రావడం వల్ల ఓడిపోగా తను మాత్రం విజయంసాధించారు. ఇవన్నీ చెప్పడమెందుకంటే పాలక పక్షాలకు చెందిన వారి మధ్య రకరకాల సంబంధాలు మంతనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్న చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావులే అంతగా ఆలింగనం చేసుకుంటే లేనిది ఏ మార్పు మాత్రం అసాధ్యం?
కమ్యూనిస్టులు మినహా మిగిలిన వారి మధ్య బాహాటంగా గాని లోపాయికారిగా గాని ఏవేవో నడుస్తూనే ఉంటాయి. కనుక కార్యకర్తలు, అభిమానులు కత్తులు నూరుకుని గొంతులమీదకు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాడటంలో తప్పులేదు గాని ద్వేషాలు పెంచుకోవడం నష్టదాయకం. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఈ కులాల ఇంజనీరింగ్ ఇప్పుడు వివిధ రూపాల్లో నడుస్తున్నది. కాపులను ఆకర్షించడం, బ్రాహ్మణుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం(తెలంగాణలోనూ ఆ దిశలో అడుగులు పడుతున్నాయి) వంటివన్నీ ఈ కుల సమీకరణల్లో భాగాలే. రాబోయే రోజుల్లో మరెన్నో ఇలాటివి చూడవలసి వుంటుంది