ప్రియదర్శి…. పెళ్లి చూపులు సినిమాలో అతని కామెడీ చూస్తే… తెలుగు తెరకు మరో హాస్య నటుడు దొరికినంత భరోసా కలిగింది. `నా చావు నేను చస్తా..నీ కెందుకు` అనే డైలాగ్.. ప్రియదర్శి అంత పాపులర్ అయిపోయింది. పెళ్లి చూపుల్లో తన కామెడీకి గానూ చాలా అవార్డులొచ్చాయి. దాంతో పాటు అకాశాలు కూడా. పెళ్లి చూపులు తరవాత ఇంచుమించుగా ఓ ఇరవై సినిమాలు చేసేశాడు. అందులో స్పైడర్ లాంటి సినిమా కూడా ఉంది. కాకపోతే ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ప్రియదర్శి కామెడీ పేలలేదు. సరికదా, కమెడియన్‌కి తక్కువ, ఎక్స్ట్రా వేషానికి ఎక్కువ అన్నట్టు అతని కామెడీ సాగింది. ప్రియదర్శినిని దర్శకులు సరిగా వాడుకోవడం లేదా? లేదంటే ప్రియదర్శినే కామెడీ పంచించలేకపోతున్నాడా? అనేది అనుమానంగా మారింది. తాజాగా ఎంసీఏలోనూ ప్రియదర్శి మెరిశాడు. కానీ.. తన పాత్ర, అందులోని డైలాగులు, దాని ద్వారా పండించిన కామెడీ అంతంత మాత్రమే. ఇలా.. ప్రియదర్శి కూడా వన్ సినిమా వండర్లా మిగిలిపోతాడేమో అనిపిస్తోంది. అర్జున్ రెడ్డి తో ఆకట్టుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ పై దృష్టి పడింది. ఇంతకుముందు రాహుల్ కూడా కొన్ని సినిమాల్లో చేసినా తగిన గుర్తింపు రాలేదు. కనీసం రాహుల్ అయినా ప్రియదర్శిలా కాకుండా ఇక నుంచి మంచి పాత్రలు ఎంచుకుంటాడేమో చూడాలి.