2017 చాలా అనుభూతుల్ని ఇచ్చింది.
ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బ్లస్టర్ హిట్లు..
విజయాలతో పాటు వివాదాలు కూడా.
అన్నింటితో పాటు ‘ఫ్లాపులూ’.
ప్రతీ వారం..ఒక్క ఫ్లాప్ సినిమా అయినా చూడడం తెలుగు ప్రేక్షకులకు అలవాటే. అయితే.. ఈ యేడాది అరి వీరభయంకరమైన ఫ్లాపులు వచ్చాయి.
నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, గోపీచంద్, బాలకృష్ణ, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు భారీ ఫ్లాపుల్ని మూటగట్టుకున్నారు. కొన్ని కొన్ని చిత్రాలు ప్రేక్షకుల పాలిట శరాఘాతంగా, నిర్మాతలకు శాపంగా మారాయి. వాటిని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే..
ఈ యేడాది నాగార్జునకు మిశ్రమ ఫలితాలు అందించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. టీవీలో బ్రహ్మాండంగా చూసేస్తారు అనుకొంటే.. టీవీ రేటింగులూ తుస్సుమన్నాయి. ‘రాజుగారి గది 2’కి మంచి టాకే వచ్చినా, ఆశించిన స్థాయిలో వసూళ్లు అందుకోలేకపోయింది. మెగా ఫ్యామిలీలో ఫ్లాపులకు కొదవ లేకుండా పోయింది. పవన్ ఖాతాలో ‘కాటమరాయుడు’ అనే అట్టర్ ఫ్లాప్ చేరింది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రొటీన్ కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమాని పవన్ ఇమేజ్ సైతం కాపాడలేకపోయింది. వరుణ్ తేజ్ చేసిన ‘మిస్టర్’ ఓ డిజాస్టర్. సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’, ‘నక్షత్రం’ ఫ్లాపుల జాబితాలో చేరిపోయాయి. యేడాది చివర్లో విడుదలైన ‘జవాన్’ మాత్రం ఓకే అనిపించుకుంటోంది. అల్లు అర్జున్ నుంచి వచ్చిన – ‘దువ్వాడ జగన్నాథమ్’ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. నందమూరి బాలయ్యకూ మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. వందో సినిమాగా విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి… సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పూరి సినిమా ‘పైసా వసూల్’ మాత్రం ‘తేడా’ కొట్టేసింది.
2017ని గోపీచంద్ ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. ఈ యేడాది గోపీకి ఏమాత్రం కలసి రాలేదు. గౌతమ్ నంద నిరాశ పరిచింది. ఆక్సిజన్ అయితే మరీ దారుణం. ఆరడుగుల బుల్లెట్ అజా పజా లేదు. మంచు ఫ్యామిలీకీ చుక్కెదురు తప్పలేదు. మనోజ్ సినిమాలన్నీ కట్టకట్టుకుని ఫ్లాప్ అయ్యాయి. విష్ణు పరిస్థితీ అంతే. శర్వానంద్‌కి ‘రాధ’ చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. లై, యుద్ధం శరణం గచ్చామి, ఉంగరాల రాంబాబు, బాలకృష్ణుడు ఇలా ఈ యేడాది ‘రొడ్డ’ కొట్టుడు సినిమాలకు లెక్కేలేదు.
ఈ ఫ్లాపులన్నీ ఒక ఎత్తయితే… ‘స్పైడర్’ మరో ఎత్తు. రూ.150 కోట్ల బడ్జెట్, ద్విభాషా చిత్రం అంటూ చాలా హడావుడి చేశారు. దానికి తగ్గట్టు ఈ సినిమాపై హైప్ కూడా ఓ రేంజులో ఉండేది. తీరా చూస్తే.. ‘స్పైడర్’ తుస్సుమంది. గతేడాది బ్రహ్మోత్సం ఎలాంటి అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిందో, ఈయేడాది స్పైడర్ అలాంటి ఫలితాన్నే ఇచ్చింది. రూపాయి పెట్టుబడి పెడితే – పావలా కూడా రాలేదంటే ఈ సినిమా ఎలాంటి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి 2017 కొంతమంది హీరోలకు, నిర్మాతలకు ఓ పీడకలలా మారిపోయింది. వీళ్లందరి జాతకాలూ 2018లో అయినా కుదుటపడతాయేమో చూడాలి.