ప్రత్యర్థులు ఏదైనా విమర్శిస్తే లేక నోరు జారితే ఆ అవకాశం తీసుకుని అంతకు పదిరెట్లు తీవ్రంగా తిట్లతో దాడి చేయడంలో దిట్టగా పేరు పొందారు ఎంఎల్ఎ రోజా. గతంలో తెలుగుదేశంలో వున్నప్పుడు అలవాటైన ఈ ఫక్కీని ఆమె వైసీపీలోకి వెళ్లాక తన పాతపార్టీపైనే ప్రయోగిస్తున్నారు. అదలా వుంచితే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా టిడిపిలో వుండగా ఎదుటి పార్టీలవారిపై వూపిరిసలపనిరీతిలో దండకం చదువుతుంటారు. వీరిద్దరూ రాజకీయంగా చాలా చక్కగా వాదించగలవారైనా బహుశా మీడియా కోణం లేదా జనాకర్షణ కోసం అలా మాట్లాడుతుంటారని నా అంచనా. రేవంత్ ఇప్పుడు ఈ ధోరణి తారాస్థాయి ఏమిటో చూపిస్తున్నారు. జడ్జర్ల జనగర్జన పేరిట మల్లురవి చొరవతో జరిగిన సభలో రేవంత్ తీవ్రవిమర్శలే చేశారు. ఆరోగ్యమంత్రి డా.లక్ష్మారెడ్డి అర్హతలపైన కూడా విసుర్లు విసిరారు. దీనికి జవాబుగా మంత్రి కూడా వ్యక్తిగత దాడి తరహాలో మాట్లాడారు. ఒకటి రెండుసార్లు అరే అన్నారు. ఇదే సమయంలో ఇంకా ఒకరిద్దరు టిఆర్ఎస్ నేతలు కూడా అదే తరహాలో దూషించారు. దాంతో కుపితుడైన రేవంత్ తన విశ్వరూపం చూపించేశారు. లక్ష్మారెడ్డిని ఇక్కడ రాయలేని పదాలతో పద్ధతులతో చీల్చి చెండాడారు. చాలా ఛానళ్లు వాటిని యథాతథంగా ప్రసారం చేయలేక సెన్సార్ శబ్దాలతో వినిపించాయి. అయితే సోషల్ మీడియాలో రెండో శ్రేణి ఛానళ్లు మాత్రం వాటిని పూర్తిగా చూపించి వీక్షకులకు విందు చేశాయి. నిజంగా ఈ భాష చూస్తుంటే ఇలాటి రాజకీయ వివాదాలు చూడవలసి వచ్చిందే అని విచారం వేస్తుంది. ఎన్నికలు దగ్గరయ్యేకొద్ది ఈ జాడ్యం ముదురుతుందేమోనని ఆందోళనా కలుగుతుంది. నాయకులు ఎవరైనా ఎవరి తప్పొప్పులు ఏమైనా ఈ తరహా నిందాభాషను ప్రజలు మాత్రం హర్షించరు.