మహౌద్రేక ఉపన్యాసకుడనీ, మాటల మాంత్రికుడనీ పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకు ఇటీవలి కాలంలో ఆకర్షణ తగ్గుతున్నదా? చెప్పిందే చెబుతున్నారనే యాంత్రిక భావన, మరీ ఎక్కువగా మాట్లాడ్డం కొంత విముఖత కలిగిస్తున్నదా? ఆయన పాల్గొన్న సభలనూ చర్చలను ప్రత్యక్షంగా చూస్తుంటే కలిగే ఒక అభిప్రాయం ఇది. వాటిలో పాల్గొనే వారు కూడా అదే అంటున్నారు. అవసరం వున్నా లేకున్నా సుదీర్ఘంగా మాట్లాడ్దం, ముందున్నవారిని ఆకట్టుకోవాలనే తాపత్రయంతో అన్నిచోట్లా ఒకే టెక్నిక్స్ వినియోగించడం, తమకున్న పరిమితులను ప్రస్తావించకుండా ఏదైనా చేయగలమన్న ఆశలు కలిగించడం సన్నిహితులు కూడా ఆమోదించడం లేదు. వాస్తవికత పెరగాల్సిన అవసరం వుందంటున్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడైనా సంభాషణల్లో మాలాటివాళ్లం ముఖ్యమంత్రిపై గౌరవంతో కాస్త సర్దుబాటు చేసి చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ పార్టీ వారే ఆగ్రహిస్తున్నారు. అంతా వ్యక్తి మయమై నోరు మూసుకుని వుండిపోతున్నామని వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో మంత్రి హరీష్ రావును దూరం పెట్టడం కూడా పెరిగిందని ఆయన అనుయాయుల బాధ. ఇవన్నీ ఒకటైతే పథకాలుఏకరువు పెట్టడం, గంభీర ప్రకటనలు చేయడం, ప్రతిదీ తానే అంతిమ పరిష్కారం చేయాలనుకోవడం ఏమిటని ఎంపిలు ఎంఎల్ఎలు ప్రశ్నలు వేస్తున్నారు. క్షేత్రస్తాయిలో వాస్తవాలు ముఖ్యమంత్రికి చేరడం లేదని తమకు కలిసే చెప్పే అవకాశం వుండదు గనక చెప్పలేకపోతున్నామని వారు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాక లెక్కలేని సర్వేలు జరిపి రిస్కు వున్న నియోజకవర్గాలను తేల్చారట. ఎవరైనా మాట్లాడబోతే నీది హైరిస్కు,మిడిల్ రిస్కు లో రిస్కు అంటూ నోరు మూసుకుంటేనే నా మద్దతు వుంటుంది లేకుంటే గెలవలేవని అధిష్టానం సంకేతాలు పంపుతున్నదట. ఇవన్నీ బహుశా కెసిఆర్పైన కూడా పనిచేసి ఆయన మాంత్రిక స్పర్శను మాయం చేస్తున్నాయేమోనని సన్నిహితులు అంటున్నారు.