హిందుత్వం… దేశ రాజకీయాల్లో అనివార్యమైన అంశంగా మార్చేస్తున్నారు! భారతీయ జనతా పార్టీ అంటేనే హార్డ్ కోర్ హిందుత్వ అనే భావజాలం ఎప్పట్నుంచే బాగా స్థిరపడిపోయింది. దాన్ని పెంచి పోషించడంతోనే రాజకీయ లబ్ధి పొందుతోంది. ఇప్పుడు అదే బాటలో రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ ను నడిపించే ప్రయత్నం చేస్తున్నారా..? భాజపాను ఎదుర్కోవాలంటే తాము కూడా హిందుత్వ అనుకూల ధోరణిలో ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారా… అంటే, అవుననే చెప్పొచ్చు. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ చాలా దేవాలయాలకు వెళ్లారు. తాను హిందువునే అని చెప్పుకున్నారు కూడా! సరే, గుజరాత్ లో ఓడిపోయారు కదా.. ఇకపై ఆ భావజాల వ్యాప్తిని తగ్గిస్తారేమో అనుకుంటే, ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరోసారి సోమనాథ్ దేవాలయానికి రాహుల్ గాంధీ వెళ్లారు. మొక్కు చెల్లించుకునేందుకే తాను ఆలయానికి వచ్చానని రాహుల్ చెప్పారు. మొక్కు చెల్లించుకోవడం అనేది వ్యక్తిగత విషయమే అని అనుకున్నా… గత కొద్దికాలంగా రాహుల్ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండటం, ఆయా సందర్భాల్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచే విధంగా వ్యాఖ్యలు చేస్తుండటాన్ని చూస్తుంటే… ఇది వ్యూహాత్మకమే అని చెప్పొచ్చు.
కర్ణాటకలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. గుజరాత్ తరువాత భాజపా లక్ష్యం ఆ రాష్ట్రమే అని అంటున్నారు. దానికి అనుగుణంగానే ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముస్లింలు తమకు ఎలాగూ ఓటెయ్యరు అనే భావన భాజపాలో చాలామందికి ఉంటుంది కాబట్టి, దానికి అనుగుణంగా బలమైన హిందుత్వ వాదంపైనే భాజపా మరోసారి ఆధారపడే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తిప్పికొట్టాలంటే తామూ ఆ తరహా వాదులమే అనే భావనను కొంతమేర వ్యాప్తి చేయాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. భాజపా అంటే గిట్టని ముస్లింలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు కాబట్టి, హిందువుల్లో కొన్ని వర్గాలను తమవైపు తిప్పుకోవాలంటే… తనలోని హిందుత్వ అనుకూల ధోరణిని బహిరంగంగా ప్రదర్శించాలన్నది రాహుల్ తాజా వ్యూహంగా కనిపిస్తోంది.
కర్ణాటకలో ఇప్పటికే కన్నడిగ భావజాలాన్ని సిద్ధరామయ్య బలంగా వ్యాప్తి చేస్తున్నారు. ఇక్కడ భాజపాకి బోణీ కొట్టే అవకాశం ఇవ్వకూడదన్నదే కాంగ్రెస్ ముందున్న లక్ష్యం! అయితే, ఈ రాష్ట్రంలో వక్కలిగ, లింగాయత్ కమ్యూనిటీల్లో హిందుత్వ భావజాలం చాలా ఎక్కువ. మఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా వేయాల్సిన ఎత్తుగడలు వేస్తుంది. ఈ ప్రయత్నాన్ని సమర్థంగా తిప్పి కొట్టాలంటే… అదే హిందుత్వ కార్డును కాంగ్రెస్ కూడా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక్క కర్ణాటక మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా ఏదైతే హిందుత్వ భావజాలాన్ని భాజపా బలమని అనుకుంటుందో, తమదీ అదే ధోరణి అనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా తామూ మరింత బలపడొచ్చు అని రాహుల్ భావిస్తున్నట్టున్నారు. కాబట్టి, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కు గుళ్లూ గోపురాల చుట్టూ ప్రదక్షిణలు పెంచడాన్ని సాఫ్ట్ హిందుత్వ వైపు వేస్తున్న అడుగులుగానే చెప్పొచ్చు.