అమ్మ నియోజకవర్గంలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన (దాదాపు 40వేల ఆథిక్యం కాబట్టి..) టిటివి దినకరన్ విజయోత్సాహంతో పొంగిపోతున్నారు. అదే ఊపులో సవాళ్లకు సై అంటున్నారు. ఇప్పటిదాకా ఒకడుగు వెనక్కు వేసినట్టు కనిపించిన దినకరన్ వర్గాన్ని ఈ గెలుపు సహజంగానే వందడుగులు ముందుకేయిస్తుందనే ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో వ్యక్తం అయింది.
నియోజకవర్గంలో కౌంటింగ్ సరళి పూర్తిగా తనకు అనుకూలంగా మారిన సంగతి గమనించిన వెంటనే దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఇది దివంగత ఎంజీఆర్, జయలలితల ఆశీర్వాదంతో అందిన గెలుపు అన్నారు. తమ పార్టీకి రెండాకుల గుర్తు కూడా దక్కనీయకుండా చేశారని అయినా ఓటర్లు వారికి తగిన బుద్ధి చెప్పారన్నారు. .మనిషి ముఖ్యం గాని ఎన్నికల చిహ్నం ముఖ్యం కాదనే విషయం తన గెలుపుతో తేట తెల్లమైందన్నారు. ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో అమ్మ వారసులం తామే ననే విషయం తెలిసొస్తుందన్నారు. తమ గెలుపుతో ప్రస్తుతం తమిళనాడును ఏలుతున్న పళని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్టయినట్టేనని ఆయన హెచ్చరించారు. ఇక ఈ ప్రభుత్వానికి మిగిలిన సమయం కేవలం మూడు నెలలు మాత్రమేనని ఆయన గడువు కూడా చెప్పేశారు. ఆ లోగా ప్రభుత్వం పడిపోనుందని జోస్యం చెప్పారు. తన విజయానికి కృషి చేసిన కోటిన్నర మంది పార్టీ కార్యకర్తలకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ దగ్గర ఆశీర్వాదం పొందేందుకు మధ్యాహ్నం 3గంటల సమయంలో జయలలిత సమాధిని సందర్శిస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే….తమిళ ప్రజల నాడికి దిక్సూచిగా విశ్లేషకులు భావించిన ఎన్నిక లో దినకరన్ గెలుపు… రాష్ట్ర రాజకీయాలపై పెను మార్పులు చూపనుందనే అంచనాల నేపధ్యంలో దినకరన్ హెచ్చరిక ఆ అంచనాలకు బలం చేకూరుస్తోందని చెప్పక తప్పదు.