తాను బిజెపిని విడనాడే ప్రసక్తి లేదని మైనింగ్ కింగ్ గాలి జనార్థనరెడ్డి ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే తనపై కేసులు పెట్టి వేధించింది తప్ప తప్పు జరిగింది లేదని చెబుతున్న గాలి మోడీ ప్రధానిగా వున్న సమయంలో ఎందుకు ఆ పార్టీని వదిలిపెడతారు? బిజెపికి అనుకూలంగా వున్నవారిమీద కేసులను పట్టించుకోవడం లేదనీ కాంగ్రెస్‌పైన ప్రాంతీయ ప్రత్యర్థులపైన కేసులు వెంటాడుతున్నారనీ చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఈ విధంగా చూసినా గాలి జనార్థనరెడ్డికి బిజెపిని మించిన రక్షణ దుర్గం వుండదు కదా! పైకి పెద్ద హడావుడి చేయకపోయినా ఆయన గతంలో లాగే రాష్ట్రంలో బిజెపికి విధేయంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గనక మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు అంతకన్నా కావలసింది వుండదు. చాలా కేసులు కొట్టివేయబడుతున్న నేపథ్యం కూడా కొంత వూరట నిస్తున్నది. ాఆర్కే ఓపెన్‌హార్ట్‌లో గాలి మాట్లాడిన తీరు చూస్తే పరిస్థితుల కారణంగా మనుషులు ఎంతగా మారిపోతారో తెలుస్తుంది. తాను గతంలో ఆవేశంతో మాట్టాడానని ఆర్కేను చంద్రబాబు వంటి వారిని అనవసరంగా దూషించానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నాటకీయత నిండిన నిజం. వైఎస్‌తో తన సంబంధాలను వ్యాపార వేత్తకూ ముఖ్యమంత్రికి వుండేవిగా తప్ప అంతకు మించిన సాన్నిహిత్యం చెప్పకపోవడం మరో విశేషం. శ్రేయోభిలాషి అన్న వర్ణన కూడా ఒప్పుకోలేదు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికలిగించే విషయాలు ఇంకా చాలా వున్నాయి గాని సంచలనాలేమీ లేవు. ఎందుకంటేఆయన ఆచితూచి మాట్లాడారు.వేదాంత ధోరణి కనపరచారు. అందులోనూ లౌక్యం కూడా పుష్కలంగా ప్రదర్శించారు.రామదాసు 18 ఏళ్లు జైలులో వున్న ఉదంతంతో తన జైలు జీవితంపోల్చడం మరో హైలెట్.