జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి రేపే ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీలు హడావుడిగా తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. కానీ తెదేపా, బీజేపీలు సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోవడంతో ఇంతవరకు తమ అభ్యర్ధుల జాబితాలని విడుదల చేయలేకపోయాయి. సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల అగ్ర నేతల మధ్య సుదీర్గ చర్చలు జరిగిన తరువాత తెదేపా-90, బీజేపీ-60 డివిజన్ల నుండి పోటీ చేయడానికి అంగీకరించాయి. కానీ ఏ ఏ డివిజన్ల నుండి ఎవరు పోటీ చేయాలనే విషయంపై ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరవలసి ఉంది. కనుక ఇవ్వాళ్ళ ఇరు పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించవచ్చును. ఇప్పటికే తెరాస, కాంగ్రెస్, వామపక్షాల కూటమి తమ అభ్యర్ధుల మొదటి జాబితాలను విడుదల చేసాయి.
ఈ ఎన్నికలు తెరాస, కాంగ్రెస్, తెదేపా-బీజేపీలకు చాలా ప్రతిష్టాత్మకమయినవి. అధికారంలో ఉన్న తెరాస ఇప్పటికయినా రాజధాని హైదరాబాద్ పై పట్టు సాధించడం చాలా అవసరం కనుక తప్పనిసరిగా ఈ ఎన్నికలలో విజయం సాధించవలసి ఉంటుంది. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లే ఈ ఎన్నికలలో కీలకం కానున్నాయి కనుక తెరాస విజయం సాధిస్తుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.
గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో వరుసగా ఓడిపోతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ, మొట్టమొదటిసారిగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలు గెలుచుకొంది. ఆ గెలుపు యాదృచ్చికంగానో లేక అదృష్టం కొద్దో దక్కింది కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకొంటోందని నిరూపించేందుకు ఈ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలవడం అత్యవసరం. లేకుంటే ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ తెరసలోకి వలసలు మొదలవ వచ్చును. అప్పుడు రాష్ట్రంలో పార్టీ మరింత బలహీనపడవచ్చును. కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమయినవే.
తెదేపా, బీజేపీలదీ ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలోనే ఉన్నాయని చెప్పవచ్చును. బీజేపీకి జంట నగరాలలో మాత్రమే మంచి పట్టు ఉందనే సంగతి అందరికీ తెలుసు. కనుక ఈ ఎన్నికలలో బీజేపీ తన సత్తా ప్రదర్శించవలసి ఉంటుంది. లేకుంటే తెలంగాణాలో ఇక ఆ పార్టీ మనుగడ కష్టమే.
గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణాలో తెదేపా చాలా ఎదురు దెబ్బలు తింటోంది. పార్టీకి చెందిన అనేకమంది నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి తెరాసలో చేరిపోవడంతో పార్టీ చాలా బలహీనపడింది. ఓటుకి నోటు కేసుతో ఆ పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోయింది. దానికితోడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు, తెలంగాణా తెదేపాకు దూరం అవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పార్టీ బ్రతికి బట్ట కడుతుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఎన్నికలలో పోటీ చేయకూడదని వైకపా నిర్ణయం తేదేపాకు చాలా కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చును. దాని వలన జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లు తెదేపా, వైకాపాల మధ్య చీలే ప్రమాదం తప్పిపోయింది. ఆంద్ర ప్రజలు తెరాస కంటే తెదేపా, బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలకే మొగ్గు చూపవచ్చును కనుక వారి ఓట్లలో అధిక శాతం తెదేపా దక్కించుకొనే అవకాశం కనపడుతోంది. ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా తెదేపా ఓడిపోయినట్లయితే ఇక తెలంగాణాలో తెదేపా పతనం మొదలయినట్లే భావించవచ్చును. కనుక ఈ ఎన్నికలలో గెలవడం తెదేపాకు కూడా అత్యవసరం. ఈ ఎన్నికలలో తెదేపా తన సత్తా చాటుకోలేకపోయినట్లయితే, ఇక తెలంగాణాలో ఆ పార్టీ పతనం ప్రారంభం అయినట్లే భావించవచ్చును.