రాష్ట్రపతి కోవింద్ రాక సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను కూడా గవర్నర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు చాలాసేపు కలిసి ముచ్చటించుకున్నారు. ఇద్దరూ పక్కకు వెళ్లి మరీ.. నిలబడే నవ్వుతూ మాట్లాడుకున్నారు. గతంలో అయితే ‘ఇద్దరి చంద్రుల కలయిక, ఒకే వేదికపైకి ఇద్దరు ముఖ్యమంత్రులు’ అంటూ ప్రత్యేకంగా చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల మధ్య.. మరీ ముఖ్యంగా తెరాస, టీడీపీల మధ్య ఒక రకమైన సయోధ్యాపూరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చట్లు..!
గవర్నర్ విందుకి వచ్చిన జనసేనాని, సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా పలకరించారు. అంతేకాదు, ఈ ఇద్దరూ చాలాసేపు నిలబడే మాట్లాడుకున్నారు. అక్కడున్నవారి అందరి లుక్కూ వారిపైనే పడింది. దీంతో రకరకాల ఊహాగానాలకు రెక్కలొచ్చేందుకు ఈ కలయిక ఇప్పుడు కారణమౌతోంది..! నిజానికి, ఇదే తరహాలో ఆ మధ్య టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. అది ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ, తెరాసల మధ్య పొత్తు పొడుపునకు అనంతపురంలోనే నాంది పడిందనే విశ్లేషణలూ వచ్చాయి. ఆ తరువాతి నుంచి తెరాస, టీడీపీల మధ్య మరింత సామరస్యపూరిత వాతావరణం పెరిగింది. ఎంతగా అంటే.. హైదరాబాద్ ఐటీ రంగ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎప్పటికీ మరచిపోలేనిది తెరాస మంత్రి కేటీఆర్ మెచ్చుకునేంతగా!
ఆ సయోధ్యకు కొనసాగింపే ఈ కలయిక అనే అభిప్రాయాలకు తావిస్తోంది! ఎలాగూ టీడీపీ, తెరాసల మధ్య స్నేహం బలపడే దిశగా ఉంది. పైగా, ఆ డిమాండ్ తెరాసవైపు నుంచే కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దానికి వెనక ఓ ‘సామాజిక’ అవసరమూ తెరాసకు ఉంది. సో.. పవన్ కూ టీడీపీకి ఉన్న స్నేహం కూడా బలమైంది కదా. కాబట్టి, వయా టీడీపీ మీద అభిమానం కోణం నుంచీ పవన్ కు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ ను కేసీఆర్ పంపుతున్నారేమో అనేది కొంతమంది కామెంట్. ఇంకోపక్క భాజపాకి కూడా పవన్ అంటే అభిమానమే ఉంది! తెరాస కూడా ఎలాగూ ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షమే అనాలి. ఈ కూడికలూ తీసివేతలూ బాగాహారాలూ అన్నీ పడికడితే.. పవన్ కు కేసీఆర్ పలకరింపు వెనక ఏదో ఒక శేషమో విశేషమో భాగఫలమో ఏదో ఒకటి కచ్చితంగా ఉండే ఉంటుంది కదా! అదేదో త్వరలోనే తెలుస్తుంది.