సంక్రాంతి సినిమా అంటే హాట్ కేక్ కింద లెక్క. సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు ఎంత రెడీగా ఉంటారో, విడుదల చేయడానికి బయ్యర్లూ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పైగా బాలకృష్ణలాంటి హీరో అంటే ఆ క్రేజ్ చెప్పాల్సిన పనిలేదు. ఆయన సంక్రాంతి హీరో. సంక్రాంతి సీజన్లో సినిమా విడుదల చేయడం, హిట్టు కొట్టడం బాలయ్యకు అలవాటే. డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ఱి.. రేపు జై సింహా… ఇలా వరుసగా మూడో యేడాది సంక్రాంతి బరిలో నిలిచాడు బాలయ్య. పవన్ కల్యాణ్ `అజ్ఞాతవాసి` మినహాయిస్తే… సంక్రాంతికి ఇప్పటి వరకూ మరో సినిమా ఖరారు కాలేదు. ఒకవేళ ఉన్నా ఫర్వాలేదు. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదల అవ్వడం, అన్నీ హిట్లు సాధించడం చూస్తూనేఉన్నాం. సినిమా ఏమాత్రం బాగున్నా.. వసూళ్ల పండగ చేసుకోవొచ్చు. కానీ నిర్మాత సి.కల్యాణ్ మాత్రం ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. బాలయ్యకు ఎప్పుడూ పర్మినెంట్ బయ్యర్లు ఉంటారు. బాలయ్య సినిమా వారి చేతుల్లోకి వెళ్లాల్సిందే. వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా కొన్ని చోట్ల.. బాలయ్య మార్కెట్ స్థిరంగానే ఉండేది. ఇప్పుడు బాలయ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. పైసా వసూల్ ఫ్లాప్ అయినా – ఊహించని విధంగా మార్కెట్ పడిపోలేదు. సో… బాలయ్య సినిమా ఇప్పటికీ హాట్ కేకే. కానీ… సి.కల్యాణ్ మాత్రం ‘ఓన్ రిలీజ్’ అనే మంత్రం జపిస్తున్నాడు. లాభాలూ నావే.. వస్తే రిస్కూ నాదే.. అన్నట్టుగానే వేదికపై స్పీచ్ ఇచ్చారు. సినిమాపై నమ్మకమో, సంక్రాంతి సీజన్‌పై నమ్మకమో తెలీదుగానీ – సి.కల్యాణ్ ఈ సినిమాని అమ్మడానికి ఒప్పుకోవడం లేదు.
ఓన్ రిలీజ్ అనేది సి.కల్యాణ్ గేమ్ ప్లాన్‌లో ఓ భాగమని మరో వర్గం గుసగుసలాడుకొంటోంది. ‘సినిమా అమ్మను… అమ్మను’ అని పదే పదే చెబితే.. బయ్యర్లు వరుస కట్టడం మొదలెడతారని, చెప్పిన రేటుకి సినిమా కొనడానికి రెడీ అవుతారని.. అందుకే లాజిక్ ప్లే చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ట్రైలర్ చూస్తే మాత్రం కల్యాణ్ మరీ గుడ్డిగా దూసుకెళ్లిపోవడం లేదనిపిస్తుంది. ఈమాత్రం యాక్షన్ ప్యాకేజ్ వెండి తెరపైనా ఉంటే, పైసా వసూల్ సినిమాగా జై సింహా నిలబడిపోతుంది. అందుకే.. సి.కల్యాణ్ ఈ రిస్కు తీసుకోవడానికి రెడీ అయ్యాడేమో.