వైకాపా, తెరాసల మధ్య రహస్య అవగాహన, అనుబంధం ఉన్నప్పటికీ, ఎన్నడూ తెలంగాణా రాజకీయాలలో జోక్యం చేసుకోని జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి తరపున వరుసగా మూడు రోజుల పాటు ప్రచారం చేశారు. కానీ తెరాసతో ఎటువంటి అనుబంధం, అవగాహన లేకపోయినప్పటికీ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తన పార్టీ తరపున ప్రచారం చేయడానికి వెనుకాడుతున్నారు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే కనుక మళ్ళీ వాటి గురించి ఏకరువు పెట్టుకోనవసరం లేదు. ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్న తెదేపా-బీజేపీ కూటమి ఓడిపోయినట్లయితే, తెలంగాణాలో ఆ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారవచ్చును. ఈ సంగతి రాజకీయాలలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి తెలియదనుకోలేము. అయినా కూడా అందరికీ తెలిసిన ఆ కారణాల చేత ఆయన ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీలకు అండగా నిలబడకపోయినట్లయితే, ఓటమి తరువాత అందుకు తీరికగా పశ్చాతాపపడవలసి రావచ్చును.
అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షాల మధ్య మంచి సఖ్యత ఉండటం ఎంత సర్వసాధారణమయిన విషయమో అలాగే ఓటమి తరువాత కీచులాటలు, విడిపోవడాలు కూడా అంతే సర్వ సాధారణమయిన విషయం. కనుక ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి ఓడిపోయినట్లయితే తెలంగాణాలో ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణాలో తెదేపాతో జత కట్టడం వలన తమ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు, మునిగిపోతున్న దానితో కలిసి తాము కూడా మునగడం దేనికి? అని బీజేపీ భావిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
చంద్రబాబు నాయుడు తెరాస పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి ఓడిపోయినట్లయితే, బీజేపీ తెదేపాతో తెగతెంపులు చేసుకోవచ్చును. అప్పుడు ఆ ప్రభావం ఆంధ్రాలో ఆ రెండు పార్టీల సంబంధాలపై కూడా పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆంధ్రా, తెలంగాణాలలో రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగినట్లయితే అప్పుడు ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై కూడా పడే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు తెదేపా, బీజేపీలు విడిపోకపోయినప్పటికీ, జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఓటమి దానికి బీజం వేయవచ్చును.