తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు నాలుక పదునైంది. ఎన్టీఆర్ లక్ష్వీ పార్వతి వర్గంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడుపైన ఆయన మాట్లాడిన తీరు రాజకీయ వర్గాలకు బాగా తెలుసు.అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్‌పై దాడికి ఆయన ఆయుధంగా వుండేవారు. విభజన తర్వాత కేంద్రంలో టిడిపి చోటు సంపాదించింది గనక మోత్కుపల్లిని ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. మీడియానే గాక టిడిపి బిజెపి నేతలు కూడా ఇందుకు కారణమైనారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కాబోయే ముందు కూడా ఆ ఆశలకు నీరు పోశారు.అయితే అలాటి అవకాశమేమీ లేదని క్రమంగా స్పష్టమై పోయింది. ఇప్పుడు మోత్కుపల్లి తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. తనను అందరిలో ఆ విధంగా చిత్రించి తర్వాత ఆశాభంగం కలిగించడం అవమానమని కూడా అనుకుంటున్నారు. ఈ కోపంలో పార్టీలోని తన పాత ప్రత్యర్థి,ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిపై చిటపటలాడారు.అసలు రేవంత్ నాయకుడే కాదని తీసిపారేశారు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంటుగా ఆయనకు అంత అవకాశం ఇవ్వడమే తప్పని పరోక్షంగా అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన గవర్నర్ గిరీ కోసం ఆయన గట్టిగానే కృషి చేశారని కొనియాడారు.మొత్తంపైన మోత్కుపల్లి నైరాశ్యం మరోసారి ఆయనలోని మాటలదాడి పెంచుతున్నట్టు సహచరులు చెబుతున్నారు. కొంతమందైతే ఆయన బిజెపి సంగతి తెలిసి కూడా గవర్నర్ అవుతాననుకోవడమే పొరబాటని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆశ పూర్తిగా పోయిందని మాత్రం చెప్పలేం.