అదిగో ఇదిగో అన్నారు. రజనీకాంత్ త్వరలోనే పార్టీ పెట్టేస్తున్నారు అన్నారు. భాజపాతో పొత్తు కూడా అనేశారు. ఇలా గడచిన కొన్నాళ్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి చాలా రకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ, తన పొలిటికల్ ఎంట్రీపై ఎక్కడా ఎలాంటి స్పష్టమైన ప్రకటనా తలైవా చేయలేదు. కాలంపైనా దేవుడిపైనా నెపాన్ని నెట్టేస్తూ వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు, తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడుతున్న తరుణంలో… కొంత స్పష్టత వచ్చే దిశగా రజనీ తొలి అడుగు వేశారు. వరుసగా ఐదు రోజులపాటు అభిమానులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. దాన్లో భాగంగా తొలిరోజున చెన్నైలోని కోడంబ్కాకంలో ఉన్న రాఘవేంద్ర కల్యాణ మంటపంలో అభిమానుల సమావేశం నిర్వహించారు. తిరువళ్లూరు, కాంచీపురం, ధర్మపురి, కృష్ణగిరి, నీలగిరి ప్రాంతాలకు చెందిన ఫ్యాన్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొంత స్పష్టత ఇచ్చే విధంగానే మాట్లాడారు.
రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన ఈ నెల 31న ఉంటుందని రజనీ చెప్పారు. రాజకీయాలు తనకు కొత్త కాదని, 1996 నుంచి చూస్తూనే ఉన్నానని అన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశాననీ, దేవుడి దయ ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి తాను వస్తానంటూ రజనీ ప్రకటించడం గమనార్హం! యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలన్నారు. ఈ సమావేశంలో తన సినీ జీవితం గురించి కొంతసేపు మాట్లాడారు. మొదట్లో తనకు హీరో అవుతాననే నమ్మకం లేదనీ, వద్దని సలహా ఇచ్చినవారు కూడా ఉన్నారన్నారు. తొలి సినిమా హిట్ అయిన తరువాత అభిమానించేవారు పెరగడంతో కొంత ధైర్యం వచ్చిందన్నారు. తాను నటించేదే నటన అని మొదట్లో అనుకునేవాడిననీ, తరువాత చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పారు.
రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి రజనీ చేసిన ప్రకటనపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు మరింత స్పష్టమైన ప్రకటన ఉంటుందని వారు ఆశిస్తున్నారు. అయితే, దేవుడి దయ ఉంటే తప్పకుండా వస్తానని రజనీ వ్యాఖ్యానించడంలో కొంత మీమాంస కనిపిస్తోందని అనేవారూ లేకపోలేదు. ఏదేమైనా, ఈ ఐదురోజుల భేటీలు పూర్తయ్యాక స్పష్టమైన నిర్ణయం ఏదో ఒకటి ఉంటుందనే వాతావరణమే కనిపిస్తోంది. తొలిరోజు వెయ్యి మంది అభిమానులతో భేటీ అవుతున్నారు. ఇలాగే మిగతా నాలుగు రోజులూ అభిమానుల సమావేశాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పాస్ లను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన నాలుగు రోజులకే రజనీ ఈ సమావేశాలు నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఆర్కే నగర్ ఫలితం తరువాత తమిళనాట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఆస్కారం పెరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఎంట్రీ ప్రకటన కూడా ఉంటే తమిళ రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంటుంది.