2014 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు భూటకపు వాగ్దానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి గెలిచారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం అందరికీ తెలిసిందే. పంటరుణాల మాఫీని అందుకు ఉదాహరణగా పేర్కొంటుంటారు. సాధ్యం కాని అటువంటి అనేక హామీలను గుప్పించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేరని కానీ తాము అటువంటి భూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడానికి ఇష్టపడనందునే ఓడిపోయామని చెప్పుకొంటుంటారు.
పంటరుణాల మాఫీ చేస్తామని వైకాపా హామీ ఇవ్వకపోయినా ఎన్నికల సమయంలో అందుకు ఏమాత్రం తీసిపోని అనేక హామీలను గుప్పించిన విషయం అందరికీ తెలుసు. అయినా ఆ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అందరూ ఈ ‘ఫౌల్ గేమ్’ గురించి నోళ్ళు నొప్పి పుట్టేవరకు చాలా రోజులు మాట్లాడారు. కానీ తమ ఓటమికి అదొక్కటే కాదు.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో ఎటువంటి పరిపాలనానుభవం లేని జగన్మోహన్ రెడ్డి కంటే అపార అనుభవం కలిగిన, తన పరిపాలనా దక్షతని నిరూపించుకొన్న కారణంగానే చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేశారనే సంగతి జగన్ తో సహా వైకాపా నేతలందరికీ కూడా తెలుసు.
రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడంలో చంద్రబాబు నాయుడు సఫలమాయ్యారా లేదా అనే దానిపై 2019 ఎన్నికలలో ప్రజలు తీర్పునిస్తారు కనుక దానిపై కూడా ప్రస్తుతం వాదోపవాదాలు అనవసరం. అయితే 2014 ఎన్నికలలో తప్పకుండా తామే అఖండ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత తమ ఓటమికి కారణాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నాలు చేసినట్లు కనబడటం లేదు. పైగా త్వరలోనే తెదేపా ప్రభుత్వం కూలిపోతుందని, తానే ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు ప్రజా సమస్యలన్నిటినీ మంత్రదండం తిప్పి మాయం చేసేస్తానని అనవసరంగా గొప్పలు చెప్పుకొంటూ నవ్వులపాలవుతున్నారు.
ప్రజా సమస్యలపై ఆయన ప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడుతునప్పటికీ, వాటి వలన రాష్ట్రంలో మరింత బలపడవలసింది పోయి, ఆయన తొందరపాటు నిర్ణయాల వలన తరచూ ఎదురుదెబ్బలు తింటున్నారు. పంట రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి విషయాలలో ఎదురుదెబ్బలు తినడం గమనించవచ్చును. అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య చాలా తప్పటడుగులు వేస్తున్నారు. దానిని మంచి అవకాశంగా మలుచుకొని ప్రజలను ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకోలేకపోతున్నారనిపిస్తుంది. రూ.180 కోట్ల ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేయాలనుకోవడం, ఇటీవల గ్రేటర్ ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగంపై వైకాపా నేతలు ప్రతిస్పందించకపోవడం వంటివి అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
తెదేపా ప్రభుత్వం వరుసగా అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం మాని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏమేమి చేయబోతున్నామో చెప్పుకొని ప్రజలను ఆకట్టుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆర్టీసీ కార్మికులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చేరు. తద్వారా రాష్ట్రంలో 70, 000 మంది ఆర్టీసి కార్మికులకి మేలు జరుగుతుందని చెప్పారు. తమ సమస్యలపై వైకాపా ప్రభుత్వంతో పోరాడి తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆశిస్తుంటే, వైకాపా అధికారంలోకి వచ్చేక వారి సమస్యలు పరిష్కరిస్తామని రామచంద్రారెడ్డి చెప్పడంచాలా హాస్యాస్పదంగా ఉంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమయినట్లయితే, చంద్రబాబు నాయుడు దానిపై కూడా ఓ హామీ పడేసి ఉండేవారు లేదా ఆ తరువాత అయినా ఆపని చేసి ఉండేవారు. కానీ ఒకేసారి ఏకంగా 70వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాలలోకి తీసుకోవడం అసాధ్యం కనుకనే వెనకాడి ఉంటారనుకోవలసి ఉంటుంది. మరి ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి చనద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేరని ఆరోపిస్తున్న వైకాపా కూడా ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తానని హామీ ఇస్తోంది? అధికారంలో రావడానికేనా? అనే ప్రశ్నకు వైకాపాయే జవాబు చెప్పాల్సి ఉంటుంది. రాజధాని భూసేకరణ, పంట రుణాల మాఫీ, బాక్సైట్ తవ్వకాలు, ఇతర సమస్యలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడుతున్నారు కనుక రామచంద్రారెడ్డి కూడా ఆయననే సింపుల్ గా ఫాలో అయిపోయారేమో?